హైదరాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌పై వ్యవహారంపై డీసీపీ రష్మీ పెరుమాళ్ ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆ ఆస్పత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లకు 2021లోనే గడువు తీరిందని చెప్పారు. సంతానం కలగని దంపతులను సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత మోసగించారని చెప్పారు. ''సంతానం కలగని దంపతులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు వెళ్లారు. దంపతులకు డాక్టర్ నమ్రత పలు పరీక్షలు నిర్వహించి ఐవీఎఫ్ సాధ్యం కాదని.. సరోగసీ ద్వారా పొందవచ్చని చెప్పారు. రూ.30 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. సరోగసీ కోసం విశాఖకు చెందిన దంపతులను ఒప్పించానని నమ్రత చెప్పారు. వారు రూ.5 లక్షలు అడిగారని తెలిపారు. దంపతుల నుంచి అండం, వీర్యం సేకరించి సరోగసీ చేస్తున్నామన్నారు. విశాఖలోని ఓ గర్భిణిని సరోగసీ మదర్ అని చూపించారు. కొన్నాళ్ల తర్వాత విశాఖ ఆస్పత్రిలో ఓ బాబును దంపతులకు ఇచ్చారు. సరోగసీకి అంగీకరించిన మహిళ అదనంగా డబ్బు అడుగుతున్నారన్నారు. డాక్టర్ అడిగిన అదనపు డబ్బులు కూడా దంపతులు ఇచ్చారు. ఈ కేసులో నమ్రత అసలు సరోగసీ చేయలేదు. శిశువు వద్దనుకున్న అస్సాంకు చెందిన ఒక మహిళకు రూ.90వేలు చెల్లించారు. ఆమెకు శిశువు పుట్టగానే తీసుకున్నారు. ఆ తర్వాత దంపతులకు అనుమానం వచ్చింది. దీంతో డీఎన్‌ఏ టెస్టు చేయించారు. ఈ క్రమంలో శిశువు ఆ దంపతులకు చెందినది కాదని తేలింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకులు చాలా నిబంధనలు ఉల్లంఘించారు. ఆ ఆస్పత్రికి సరైన అనుమతులు లేవు.. చాలా ఫిర్యాదులు కూడా ఉన్నాయి. డాక్టర్, సిబ్బంది ఎవరూ సరైన నిపుణులు కాదు. ఆస్పత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్‌కు 2021లోనే గడువు తీరింది. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నారు. దీనిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అందుకే ఆస్పత్రిని మూసివేస్తున్నట్లు కోర్టుకు చెప్పారు. ఆస్పత్రిని చాటుమాటుగా నిర్వహిస్తున్నందున అధికారులు గుర్తించలేకపోయారు. ఇది సరోగసీ కాదు, చైల్డ్ ట్రాఫికింగ్. న్యాయవాదినని చెప్పుకొని నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ బాధితులను బెదిరించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశాం. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశాం'' అని డీసీపీ రష్మీ పెరుమాళ్ వివరించారు.
దంపతులను నమ్మించి మోసం చేసిన సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో ఏడుగురు నిందితుల అరెస్ట్ !
July 27, 2025
0
Tags