కాంగోలో తిరుగుబాటుదారులు చర్చిపై జరిపిన దాడుల్లో 21 మంది మృతి !

Telugu Lo Computer
0


కాంగో దేశంలో ఇస్లామిక్‌ స్టేట్‌ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు ఓ చర్చి ప్రాంగణంలో జరిపిన దాడుల్లో దాదాపు 21 మంది మృతి చెందారు. తూర్పు కాంగో కోమాండాలోని ఓ క్యాథలిక్‌ చర్చి ప్రాంగణంలో అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్‌ (ఏడీఎఫ్‌) సభ్యులు తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో కాల్పులకు తెగబడ్డారు. ఈ హింసాత్మక ఘటనలో అనేక ఇళ్లు, దుకాణాలు కూడా దహనమయ్యాయి. ''సాయుధ తిరుగుబాటుదారులు దాదాపు 21 మందిని కాల్చిచంపారు. మూడు మృతదేహాలు కాలిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. అదేవిధంగా అనేక ఇళ్లు దహనమయ్యాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి'' అని ఓ సామాజిక కార్యకర్త మీడియాకు వెల్లడించారు. కాంగో సైనిక ప్రతినిధి సైతం ఈ దాడులను ధ్రువీకరించారు. అయితే.. ఈ ఘటనలో 10 మంది మరణించినట్లు చెప్పారు. ఇస్లామిక్ స్టేట్‌తో ముడిపడి ఉన్న ఏడీఎఫ్‌ తిరుగుబాటు సంస్థ.. ఉగాండా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పౌరులే లక్ష్యంగా అనేక సంవత్సరాలుగా దాడులకు పాల్పడుతోంది. 2013 నుంచి ఇప్పటివరకు దాదాపు 6,000 మందిని బలిగొన్నట్లు నివేదికలు ఉన్నాయి. ఏడీఎఫ్‌ఫై అమెరికా, ఐరాస భద్రతామండలిలు ఆంక్షలు విధించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)