రాబోయే ఆర్థిక సంవత్సరంలో 12వేలకు పైగా ఉద్యోగులను తొలగించనున్న టీసీఎస్‌ ?

Telugu Lo Computer
0


రాబోయే ఆర్థిక సంవత్సరంలో తమ ఉద్యోగుల సంఖ్యలో 2శాతం మందికి పైగా తొలగించనుంది. సాంకేతిక రంగంలో శరవేగంగా చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా భవిష్యత్తు పరిణామాలకు తమ సంస్థను మరింత దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ టీసీఎస్‌ సీఈవో కె.కృతివాసన్‌ 'మనీకంట్రోల్‌'కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఉద్యోగాల కోత నిర్ణయం అన్ని దేశాల్లోని టీసీఎస్‌ విభాగాల్లో అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 'కొత్త సాంకేతికతలను మరీ ముఖ్యంగా ఏఐ, ఆపరేటింగ్‌ మోడల్‌ మార్పులను మేం గుర్తిస్తున్నాం. పనిచేసే విధానాలూ మారుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తుకు సన్నద్ధం కావాలి. చురుగ్గా వ్యవహరించాలి. అందుకోసం మేం ఏఐని వినియోగిస్తూ.. భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను ఎవాల్యుయేట్‌ చేస్తున్నాం. మా ఉద్యోగులకు కెరీర్‌ వృద్ధి, విస్తరణ అవకాశాలను ఎలా అందించగమనే విషయంలో చాలా పెట్టుబడి పెట్టాం. కానీ, కొన్ని రోల్స్‌లో ఇది అంత ప్రభావవంతంగా జరగలేదని మేం గుర్తించాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 2శాతం మందిపై ప్రభావం చూపుతుంది. ప్రధానంగా మధ్యస్థ, సీనియర్‌ స్థాయిల్లో ఉద్యోగాలపై ఎఫెక్ట్‌ ఉంటుంది. అయితే, ఇది అంత సులభమైన నిర్ణయమేమీ కాదు. సీఈవోగా నేను తీసుకొంటున్న అతి కఠిన నిర్ణయాల్లో ఇది ఒకటి'' అని ఆయన అన్నారు. బలమైన టీసీఎస్‌ నిర్మాణంలో భాగంగా తాము తీసుకోవాల్సిన అతి కఠిన నిర్ణయాల్లో ఇదొకటని కృతివాసన్ అన్నారు. లేఆఫ్‌లు ఇచ్చినా సాధ్యమైనంత రీతిలో ఆ ఉద్యోగులకు మేలు చేసేందుకు కంపెనీ కృషిచేస్తుందని తెలిపారు. టీసీఎస్‌లో జూన్‌తో ముగిసిన తాజా త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 6,13, 000గా ఉంది. అందువల్ల 2శాతం ఉద్యోగాల తగ్గింపు నిర్ణయంతో దాదాపు 12,200 మందిపై ప్రభావం పడనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)