మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'లడ్కీ బహిన్ యోజన' పథకం అక్రమాలకు నెలవైంది. ఏకంగా 14,298 మంది పురుషులు అక్రమంగా లబ్ధి పొందుతున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి రూ.21.44 కోట్ల నగదు వీరి ఖాతాల్లోకి బదిలీ అయినట్లు మహిళ, శిశు అభివృద్ధి శాఖ నిర్వహించిన ఆడిట్‌లో తేలింది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు.. భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం 'లడ్కీ బహిన్ యోజన' పథకం తీసుకొచ్చింది. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల కంటే తక్కువ ఉన్న 21 -65 ఏళ్ల మధ్య మహిళలకు నెలకు రూ.1,500 ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్లుగా అధికారులు కార్యాచరణ మొదలు పెట్టారు. అయితే, కొందరు పురుషులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ను తప్పుదోవ పట్టించి, మహిళలుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పథకం ప్రారంభమైన 10 నెలలకు గానీ, అధికారులు ఈ విషయాన్ని గుర్తించలేకపోవడం గమనార్హం. పేద మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చామని, పురుషులు లబ్ధిదారులుగా చేరడం సరికాదని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు. ఆ మొత్తాన్ని వారి నుంచి తిరిగి వసూలు చేస్తామని, అందుకు సహకరించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఒక్కో కుటుంబం నుంచి గరిష్ఠంగా ఇద్దరికే పథకాన్ని వర్తింప చేయగా.. చాలా కుటుంబాల్లో ముగ్గురు కూడా రిజిస్టర్ చేసుకున్నారు. తద్వారా ప్రభుత్వానికి రూ.1,196 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్లు డబ్ల్యూసీడీ తేల్చింది. గరిష్ఠ వయసు పరిమితి 65 ఏళ్లుగా పెట్టినప్పటికీ.. అంతకు పైబడిన 2.87 లక్షల మంది మహిళలు లబ్ధిపొందుతున్నారు. దీనివల్ల మరో రూ.431.7 కోట్ల నష్టం వాటిల్లుతోంది. మరోవైపు నాలుగు చక్రాల వాహనాలు కలిగిన 1.62 లక్షల మంది మహిళలు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉన్నట్లు డబ్ల్యూసీడీ గుర్తించింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్లు వస్తున్నాయి.
'లడ్కీ బహిన్ యోజన' పథకంలో లబ్ధి పొందుతున్న14,298 మంది పురుషులు !
July 27, 2025
0
Tags