కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల ప్రత్యేక అధికారులు ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో ఘర్షణకు దిగినట్టు తెలుస్తోంది. సిద్ధరామయ్య అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ సి.మోహన్ కుమార్, డీకే శివకుమార్ ప్రత్యేక అధికారి హెచ్.ఆంజనేయ మధ్య మాటల యుద్ధం దాడులకు దారితీసిందని తెలుస్తోంది. తనపై మోహన్ కుమార్ షూతో దాడి చేసినట్టు ఆంజనేయ ఆరోపించారు. రెసిడెంట్ కమిషనర్ ఇంకోంగ్లా జమీర్‌కు ఆంజనేయ ఫిర్యాదు చేయడం, మోహన్ కుమార్‌పై చర్య తీసుకోవాలని కోరడంతో ఈ విషయం వెలుగుచూసింది. 'నన్ను షూతో కొట్టారు. నా గౌరవానికి, ప్రతిష్ఠకు భంగం కలిగించారు. ఆయనపై క్రిమినల్ విచారణ జరిపించండి' అని ఆంజనేయ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, తనకు ఫిర్యాదు అందిన విషయం నిజమేనని జమీర్ ధ్రువీకరించారు. జూలై 22న ఫిర్యాదు అందిందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రూప్-బి అధికారి అయిన ఆంజనేయ తన ఫిర్యాదులో తన విధులను ఒక క్రమపద్ధతిలో కుమార్ అడ్డుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఆఫీసు ఛాంబర్‌లో అందరి కళ్లముందు చెప్పుతో కొడతానని బెదిరించినట్టు తెలిపారు. ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న తాను వ్యక్తిగత భద్రతపై ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు. తనకు ఏదైనా జరిగితే దానికి కుమార్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా కుమార్ సర్వీస్ రికార్డులు చూస్తే ఎంఎం జోషిని కొట్టారని, అధికారులకు ఏమాత్రం ఆయన గౌరవం ఇవ్వడని, సీఎం స్పెషల్ ఆఫీసర్ అనే ఇగో ఆయనకు ఉందని ఆరోపించారు.
ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రత్యేక అధికారుల బాహాబాహీ
July 26, 2025
0
Tags