అంకుల్ నన్ను కాపాడండి ప్లీజ్...!

Telugu Lo Computer
0


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చౌరస్తాలో శనివారం ఉదయం ఓ ట్యాంకర్ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న తండ్రి, కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ట్యాంకర్ టైర్ల కింద ఇరుక్కొని మృత్యువతో పోరాడుతూ ఆ అమ్మాయి చేసిన ఆర్తనాదాలు అక్కడి వారిచే కంటతడి పెట్టించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాద్‌నగర్‌కు చెందిన మచ్చేందర్ శంషాబాద్‌లోని వర్ధమాన్ కళాశాలలో బీటెక్ చదువుతోన్న తన కూతురు మైత్రిని కళాశాలకు పంపేందుకు స్కూటీపై బస్టాప్‌కు బయలుదేరారు. షాద్‌నగర్ చౌరస్తా వద్దకు రాగానే వేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్ లారీ వారి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మచ్చేందర్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మైత్రి లారీ టైర్ల మధ్యలో ఇరుక్కుపోయింది. తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతూ 'అంకుల్ నన్ను కాపాడండి ప్లీజ్' అంటూ ఆమె చేసిన ఆర్తనాదాలు, ఆ దృశ్యాన్ని చూసిన వారిని తీవ్రంగా కలచివేశాయి. ప్రమాదం జరిగిన వెంటనే, మైత్రి అతి కష్టమ్మీద తన మొబైల్‌ను సమీపంలో ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చి, కుటుంబ సభ్యులకు ఫోన్ చేయాలని ప్రాథేయపడింది. ఆమె చివరి నిమిషంలో చేసిన ఈ ప్రయత్నం అక్కడి వారి కళ్ళల్లో నీళ్లు నింపింది. అదే సమయంలో స్నేహితురాలి నుంచి మైత్రికి ఫోన్లు రావడంతో, స్థానికులు ప్రమాదం విషయాన్ని చెప్పి, ఆమె బంధువులకు సమాచారం అందించారు. మైత్రి ఆర్తనాదాలు చేస్తూనే రక్తం ఎక్కువగా పోటవంతో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన షాద్‌నగర్ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)