ఆగస్టు 15న ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం

Telugu Lo Computer
0


గస్టు 15న ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇందు కోసం కొత్త క్యాంటీన్ నమూనాలను డిజైన్ చేసారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో వీటిని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ క్యాంటీన్ల ద్వారా అందించే మోనూతో పాటుగా వాటి ధరలను ఫిక్స్ చేసారు. హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ సహకారం అందిస్తోంది. వీటి ద్వారా రూ.5 భోజన కేంద్రాల్లోనే అల్పాహారం అందుబాటులో ఉండనుంది. క్యాంటీన్‌ నమూనానూ బల్దియా మారుస్తోంది. 40/10, 20/10 పరిమాణాలతో నూతన కేంద్రాలను డిజైన్‌ చేసింది. ఎక్కువ విస్తీర్ణం ఉంటే వడ్డించేందుకు అనువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఖైరతాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లో ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్‌ నూతన నమూనా ఏర్పాటు పూర్తయ్యింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్దా పనులు తుది దశకు చేరుకున్నాయి. కొత్త నమూనాలో జీహెచ్‌ఎంసీ లోగో, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిఫొటోలతో పాటు భోజనం, అల్పాహారం ఫొటోలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మొత్తం 15 డివిజన్ల పరిధిలో డివిజన్‌కు ఒకటి చొప్పున గతంలో 150 భోజన కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 128 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. లబ్ధిదారులకు అల్పాహారంగా తృణధాన్యాలతో చేసిన ఇడ్లీ, ఉప్మా, పొంగల్‌, పూరి వంటివి వడ్డించనున్నారు. వారంలో ఆరు రోజులు అల్పాహారం అందుబాటులో ఉంటుంది. ఆదివారం సెలవు. ఒక్కో టిఫిన్‌కు రూ.19 ఖర్చు కానుండగా లబ్ధిదారుడు రూ.5 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా రూ.14 హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌కు జీహెచ్‌ఎంసీ చెల్లించనుంది. మెనూలో భాగంగా డే-1 మిల్లెట్‌ ఇడ్లీ-3 (ఒక్కొక్కటి-45 గ్రా), సాంబార్‌-150 ఎంఎల్‌, పొడి-15 గ్రా అందిస్తారు డే-2 మిల్లెట్‌ ఉప్మా- 250 గ్రా, సాంబార్‌-150 ఎంఎల్‌, మిక్చర్‌/ చట్నీ-25 గ్రా ఇస్తారు. డే-3 పొంగల్‌- 250 గ్రా, సాంబార్‌- 150 ఎంఎల్‌, మిక్చర్‌- 25 గ్రా అందుబాటులో ఉంటుంది. డే-4 ఇడ్లీ-3 (ఒక్కొక్కటి-45 గ్రా), సాంబార్‌-75, చట్నీ-75 గ్రా ఇవ్వాలని నిర్ణయించారు. డే-5 పొంగల్‌- 250 గ్రా, సాంబార్‌- 150 ఎంఎల్‌, మిక్చర్‌- 25 గ్రా ఉండనుంది. డే-6 పూరి-3 (45 గ్రా.), ఆలు కూర్మ- 100 గ్రా మెనూగా ఖరారు చేసారు

Post a Comment

0Comments

Post a Comment (0)