భారత్ యూపీఐ లావాదేవీలలో ప్రపంచ అగ్రగామిగా నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ప్రతి నెలా 1800 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని ఐఎంఎఫ్ తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో రూ.24.03 లక్షల కోట్లు యూపీఐ ద్వారా బదిలీ అయ్యాయి. మొత్తం 18.39 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో 13.88 బిలియన్ లావాదేవీలు కాగా.. 32శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం 49.1 కోట్ల మంది సామాన్య ప్రజలు, 6.5 కోట్ల మంది వ్యాపారులు ఈ యూపీఐ సేవలను వినియోగిస్తున్నారు. 675 బ్యాంకులు యూపీఐ గొడుకు కిందకు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 85 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ప్రపంచంలో రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 50 శాతం ఒక్క భారతదేశంలోనే జరుగుతున్నాయి. నేడు భారత్‌తో పాటు యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి ఏడు దేశాల్లో యూపీఐ సేవలను అనుమతిస్తున్నాయి. బ్రిక్స్ సభ్యత్వ దేశాలకు యూపీఐని విస్తరించాలని రిజర్వు బ్యాంకు యోచిస్తోంది. సురక్షితమైన, వేగవంతమైన లావాదేవీల వల్ల యూపీఐ చెల్లింపులు ప్రజల్లో ఇంత ఆదరణ పొందాయి. 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకుపోయింది. అప్పటి నుంచి క్రమంగా యూపీఐ వాడకం పెరుగుతూ వస్తోంది. '' భారత్‌లో ఇప్పుడు నగదు, కార్డు ఆధారిత చెల్లింపులతో పోలిస్తే డిజిటల్ పేమెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. లక్షలాది ప్రజలు, చిన్న వ్యాపారులు దీనిపైనే ఆధారపడుతున్నారు. సురక్షితమైన, తక్కువ ధరకు అందుబాటులో ఉండడం ద్వారా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి యూపీఐ ఒక శక్తిమంతమైన సాధనంగా మారింది'' అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. వ్యక్తి నుంచి వ్యక్తికి యూపీఐ ద్వారా చేసే చెల్లింపులకు అన్ని బ్యాంకులూ రూ.1లక్ష వరకే అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే.
యూపీఐ లావాదేవీలలో ప్రపంచ అగ్రగామిగా నిలిచిన భారత్ : ఐఎంఎఫ్
July 20, 2025
0
Tags