దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 64వేల కోట్ల విలువైన వస్తువులను క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి కొనుగోలు చేసినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ కొనుగోళ్లు డబుల్ అవడం విశేషం. బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లు క్విక్ కామర్స్ సేవలను వినియోగదారులు అందిస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ యాప్‌ల నుంచి రూ.30వేల కోట్ల విలువైన వస్తువులను కస్టమర్లు కొనుగోలు చేయగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆ విలువ రూ.64000 కోట్లకు పెరిగిందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ కెరీడ్జ్ రేటింగ్స్ తమ నివేదికలో వెల్లడించింది. మరో మూడేళ్లలో అంటే 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి క్విక్ కామర్స్‌లో ఈ గ్రాస్ ఆర్డర్ విలువ మూడు రెట్లకు పైగా పెరిగి ఏకంగా రూ.2లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది. వినియోగదారుల నుంచి ఆర్డర్లు పెరగడంతో గత ఆర్థిక సంవత్సరంలో ఈ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఫీజుల రూపంలో రూ.10,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు నివేదిక తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం రూ.450 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. మరో మూడేళ్లలో ఈ ప్లాట్‌ఫామ్‌ల ఆదాయం రూ.34,500 కోట్లకు పెరగొచ్చని కెరీడ్జ్ రేటింగ్స్ పేర్కొంది. ''ప్రస్తుతం నిత్యావసర వస్తువుల డిమాండ్‌లో చూసుకుంటే కేవలం 1 శాతం మంది మాత్రమే క్విక్ కామర్స్ ఇండస్ట్రీకి మారారు. రానున్న రోజుల్లో ఈ సేవలు టైర్-2, టైర్-3 పట్టణాల్లోనూ విస్తరించే అవకాశం ఉంది. అప్పుడు వినియోగదారుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. సౌకర్యవంతమైన సేవలకు కస్టమర్లు ఎప్పుడూ మొగ్గుచూపుతారు'' అని కెరీడ్జ్ రేటింగ్స్ అభిప్రాయపడింది. 2024లో దేశంలో ఆన్‌లైన్ కొనుగోలుదారుల సంఖ్య 27కోట్లకు పైనే ఉంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఈ-రిటైల్ యూజర్ బేస్ మన దేశంలోనే ఉంది. ఈ-కామర్స్ మార్కెట్ కూడా గతేడాది 23.8శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి రూ. 64వేల కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేసిన వినియోగదారులు
July 10, 2025
0
Tags