కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్‌ను విడగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిందన్నారు. 11 ఏళ్ల మోడీ పాలనలో 33 తప్పులు చేశారని అన్నారు. దేశ యువతను తప్పుదోవ పట్టించి మోసం చేశారని ఆరోపించారు. వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముగ్గురు కాంగ్రెస్ ఎంపీల నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. దీనిపై ఎదురైన ప్రశ్నకు ఖర్గే స్పందించారు. ''కాంగ్రెస్ పార్టీని విడగొట్టేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. మా ఎంపీపై ఆరోపణలు చేసి దాడులు చేయిస్తోంది. కానీ, హస్తం పార్టీలో ఎలాంటి చీలిక రాలేదు. మేమంతా ఐక్యంగా ఉన్నాం'' అని ఖర్గే బదులిచ్చారు. ''11 ఏళ్ల మోడీ పాలనలో ఎన్నో తప్పులు జరిగాయి. మరెన్నో అబద్ధాలతో దేశ యువతను మోసం చేశారు. ఇన్నేళ్లలో ఆయన ప్రభుత్వం 33 తప్పులు చేసింది. నా రాజకీయ జీవితంలో అబద్ధాలు చెప్పి, యువత, పేదలను మోసం చేసి ఓట్లను అర్జించే ప్రధానిని ఎన్నడూ చూడలేదు. ఇప్పుడు మోడీని చూస్తున్నా. ఆయనకు ప్రజల గురించి ఆలోచన లేదు'' అని ఆరోపించారు. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఖాళీగా ఉంచడాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ''లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించాలని గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. కానీ, మోదీ సర్కార్ మాత్రం దాన్ని విస్మరించింది. ప్రతిపక్షానికి చిన్న పదవి కూడా ఇచ్చేందుకు వెనకడుగు వేస్తోంది. ఈ విషయంపై మోదీకి ఎన్నో సార్లు లేఖ రాశాను. కానీ, ఏ మాత్రం దీని గురించి పట్టించుకోలేదు. ఆయనకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని దీన్ని బట్టి అవగతం అవుతోంది. '' అని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్‌ను విడగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది : మల్లికార్జున ఖర్గే
June 11, 2025
0
Tags