చైనా పెట్టుబడులు పెడితే దేశ ఆర్థిక వ్యవస్థ మలుపు తిరుగుతుంది : మహమ్మద్‌ యూనస్‌

Telugu Lo Computer
0


చైనా - బంగ్లా వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించిన సదస్సును తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ ప్రారంభించి మాట్లాడుతూ చైనా అత్యధిక పెట్టుబడులు పెడితే తమ దేశ ఆర్థికవ్యవస్థ మలుపు తిరుగుతుందని అన్నారు. బంగ్లాదేశ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి చైనా వాణిజ్యమంత్రి వాంగ్‌ వెంటావో ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా యూనస్‌ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తయారీరంగంలో చైనా కంపెనీలు పేరుగాంచాయన్నారు. చైనాతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. తమ దేశంలో బీజింగ్‌ పెట్టుబడులు పెడితే దేశ ఆర్థికవ్యవస్థ మలుపు తిరుగుతుందన్నారు. ఇక, దేశ ఆర్థికవృద్ధిని మెరుగుపరిచి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా తాము ఉన్నట్లు తెలిపారు. పెట్టుబడులు మెరుగుపరచడం, చట్టాలను క్రమబద్ధీకరించడం, వ్యాపార కార్యకలాపాలకు అనుకూలమైన వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని చైనా కంపెనీలకు సూచించిన ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌కు యూనస్‌ కృతజ్ఞతలు తెలిపారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఇటీవల యూనస్‌ చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా భేటీ అయ్యారు. బంగ్లా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి చైనా నుంచి పెట్టుబడులను పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్ట్ లో పాల్గొనడానికి చైనా కంపెనీలను బంగ్లాదేశ్ స్వాగతించింది. డ్రాగన్ ఇస్తున్న రుణాలకు వడ్డీలను తగ్గించాలని, ఆ దేశ నిధులు అందుతున్న ప్రాజెక్టులకు కమిట్‌మెంట్ ఫీజ్‌ను మాఫీ చేయాలని, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)