ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి మాజీ శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. విదేశాలకు బయలుదేరి వెళ్లడానికి సిద్ధపడిన ఆయనను బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకున్న వాగ్వివాదం నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. పొదిలి సీఐ వెంకటేశ్వర్లుతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాగ్వివాదానికి దిగిన విషయం తెలిసిందే. దీనితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై గతంలో లుకౌట్ నోటీసులు జారీ కావడం కూడా దీనికి ప్రధాన కారణమని అంటున్నారు. ఈ నెల 11వ తేదీన వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన పొదిలి పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయన కారుపై రాళ్లు, చెప్పులు విసిరినట్లు వార్తలొచ్చాయి. వారిని అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కేసులో సుమారు 15 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని పరామర్శించడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పొదిలి పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న నిందితులను కలవడానికి అనుమతి లేదని సీఐ వెంకటేశ్వర్లు వివరించారు. దీంతో ఆయనపై చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. సీఐ వెంకటేశ్వర్లుతో వాగ్వివాదానికి దిగారు. ఆయనపైకి దూసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద 10 సంవత్సరాల పాటు గన్‍మె న్‍గా పని చేసిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. లిక్కర్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల మధ్య శ్రీలంకకు బయలుదేరి వెళ్లడానికి బెంగళూరుకు చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకున్నట్లు చెబుతున్నారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా సాగుతోంది
పోలీసుల అదుపులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ?
June 17, 2025
0
Tags