గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం అమెరికా ప్రతిపాదనలను హమాస్ తిరస్కరించింది. ఈ విషయాన్ని బీబీసీకి ఆ సంస్థ నాయకుడు తెలిపారు. అంతకుముందు అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్‌తో జరిపిన చర్చల్లోని అంశాలకు ఈ ప్రతిపాదనలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఇటీవల ఓ కాల్పుల విరమణ ప్రతిపాదనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం హమాస్ సజీవంగా ఉన్న 10 మంది బందీలను అప్పగించడంతో పాటు 18 మంది మృతదేహాలను కూడా ఇవ్వాలి. రెండు దశల్లో ఇది జరగాలి. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ 60 రోజులు కాల్పుల విరమణను పాటించడంతోపాటు.. తమ బందీలుగా ఉన్న పాలస్తీనా ఖైదీలను అప్పగించాల్సి ఉంటుంది. వాస్తవానికి హమాస్ వద్ద 58 మంది బందీలు ఉన్నారు. వారిలో కనీసం 20 మంది సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. అయితే దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. కానీ, ప్రధాని నెతన్యాహూ మాత్రం బాధిత కుటుంబాలతో మాట్లాడుతూ తాను ఆ ఒప్పందానికి అంగీకరిస్తానని చెప్పారు. ప్రస్తుతం గాజాను పూర్తిగా మూసేసిన ఇజ్రాయెల్ మార్చి 18 నుంచి ఎదురుదాడులు కొనసాగిస్తోంది. దీంతో అప్పటివరకు అమెరికా, ఖతార్, ఈజిప్ట్ సంయుక్తంగా కుదిర్చిన కాల్పుల విరమణ ఒప్పందం నీరుగారిపోయింది. ఇటీవల మే 19 నుంచి మరింత విస్తృతంగా ఇజ్రాయెల్ దళాలు ఆపరేషన్ చేపట్టాయి. అవి గాజాను పూర్తిగా అధీనంలోకి తీసుకొంటాయని నాడు నెతన్యాహూ వెల్లడించారు. గత 10 వారాల్లో దాదాపు 4,000 మంది ప్రజలు గాజాలో మరణించినట్లు హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి.
అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన హమాస్
May 30, 2025
0
Tags