మీ ప్రభుత్వ హయాంలోనే జరిగిన ఒప్పందమే అది : భాజపా ఎంపీ నిషికాంత్‌ దూబే

Telugu Lo Computer
0


పరేషన్‌ సిందూర్‌ గురించి పాకిస్తాన్‌కు ముందే సమాచారం ఇచ్చారంటూ విదేశాంగ మంత్రి జై శంకర్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆరోపణలపై భాజపా ఎంపీ నిషికాంత్‌ దూబే స్పందిస్తూ ఈ సందర్భంగా 1991 కాంగ్రెస్‌ హయాంలో జరిగిన ఒప్పందం గురించి ఆయన ప్రస్తావించారు. ఈమేరకు ఆయన శుక్రవారం ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. 'రాహుల్ గాంధీ 1991లో ఇది మీ ప్రభుత్వ హయాంలోనే జరిగిన ఒప్పందం. అప్పట్లో ప్రభుత్వం భారత్‌- పాకిస్తాన్‌ దాడులు, సైనిక కదలికలకు సంబంధించిన సమాచారం అందించుకోవడం గురించి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం దేశ ద్రోహమా? పాక్‌ మద్దతున్న మీ పార్టీ జైశంకర్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా?' అని దూబే పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను కూడా ఆయన పంచుకున్నారు. రాహుల్‌ గాంధీ ఇటీవల జైశంకర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభానికి ముందే ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లపై దాడి చేస్తున్నామని.. పాక్‌ సైన్యం వాటికి దూరంగా ఉండాలని భారత్‌ చెప్పినట్లు జైశంకర్‌ పేర్కొన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అలా చేయడం వల్ల దాయాది దేశం ముందుగానే అప్రమత్తమయ్యిందని ఆరోపించారు. ఈ కారణంగానే భారత్‌ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందన్న అంశంపై విదేశాంగ శాఖ మౌనం వహిస్తోందన్నారు. అయితే, ఈ ఆరోపణలను భారత విదేశాంగశాఖ ఖండించింది. రాహుల్‌ తమ వ్యాఖ్యలను తప్పుగా అన్వయిస్తున్నారని పేర్కొంది. ఆపరేషన్‌కు ముందు.. ఉగ్ర చర్యలపై పాకిస్థాన్‌ను హెచ్చరించామని, ఆ తర్వాత దాడులపై నిర్ణయం తీసుకున్నామని స్పష్టంచేసింది. రాహుల్‌ వ్యాఖ్యలపై పీటీఐ వార్తా సంస్థ ఫ్యాక్ట్‌ చెక్‌ కూడా ఇదే పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)