పంజాబ్‌లో పాకిస్తాన్ క్షిపణి దాడి !

Telugu Lo Computer
0


ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉలిక్కిపడిన పాకిస్తాన్, సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు తెగబడుతోంది. గురువారం తెల్లవారుజామున సుమారు 1 గంట ప్రాంతంలో పంజాబ్‌లోని అమృతసర్ సరిహద్దు జిల్లాలో భీకర శబ్దాలు, ఆకాశంలో వెలుగులు కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.అనంతరం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఉదయం జెతువాల్, మఖన్ విండి, పాంధేర్ శివారు ప్రాంతాల్లో క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. పెద్ద పేలుడు శబ్దంతో అంతా భయంతో పరుగులు తీశారు. క్షిపణిలోని ఒక భాగం జెతువాల్‌లోని పొలంలో పడింది. దాని శకలాలు ఇళ్లపై కూడా చెల్లాచెదురుగా కనిపించాయి. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆ శకలాలను స్వాధీనం చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. జెతువాల్ గ్రామానికి సమీపంలోని మఖన్ విండిలో కూడా క్షిపణి శకలాలు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆర్మీ సిబ్బంది కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.బుధవారం రాత్రి జరిగిన పేలుళ్లకు, లభ్యమైన శకలాలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ, అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమృతసర్ ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో ఇప్పటికే హై అలర్ట్‌లో ఉంది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై బుధవారం తెల్లవారుజామున దాడులు చేశాయి. భద్రతా చర్యల్లో భాగంగా అమృతసర్ విమానాశ్రయాన్ని బుధవారం ఉదయం నుంచి నిరవధికంగా మూసివేశారు. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్‌ను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత గగనతల రక్షణ వ్యవస్థ అప్రమత్తంగా వ్యవహరించి, పాక్ మిస్సైల్‌ను మధ్యలోనే ధ్వంసం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ధ్వంసమైన మిస్సైల్ శకలాలే ఇప్పుడు అమృతసర్ శివారు ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. అయితే.. అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకొనే ఈ దాడి జరిగిఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత సైన్యం ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకుంటోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)