తెలంగాణలోని జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు మాజీ మంత్రి, భారాస నేత హరీశ్‌రావు సమక్షంలో భారాసలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణకు భాజపా అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. భారాస మొదలుపెట్టిన బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టుల నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టి జహీరాబాద్ నియోజకవర్గానికి అన్యాయం చేసిందన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా మొత్తం సాగునీటితో సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ''సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు పూర్తి చేయడానికి భారాస పోరాటం చేస్తుంది. తాగు, సాగునీరు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారాస హయాంలో వచ్చిన నీళ్లు ఇప్పుడు ఎందుకు రావడం లేదు? పాలనా వైఫల్యం, కాంగ్రెస్ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. వాళ్ల మోసం ప్రజలకు తెలిసిపోయింది. మళ్లీ వచ్చేది భారాస ప్రభుత్వమే. తెలంగాణ అభివృద్ధి మాతోనే సాధ్యమవుతుంది'' హరీశ్ రావు తెలిపారు.
తెలంగాణకు బీజేపీ అన్యాయం చేసింది : మాజీ మంత్రి హరీశ్‌రావు
May 02, 2025
0
Tags