కేరళలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం పర్యటించి తిరువనంతపురం సమీపంలో రూ.8,900 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన విఝింజమ్ ఇంటర్నేషనల్ డీప్‌వాటర్ మల్టీపర్పస్ సీపోర్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ హాజరయ్యారు. దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. ''ఈ రోజు శశిథరూర్ ఇక్కడ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ కొంతమందికి నిద్ర లేని రాత్రిని మిగులుస్తుంది. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోయింది'' అని మోడీ చమత్కరించారు. కాగా గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధానిని థరూర్ వ్యక్తిగతంగా వెళ్లి స్వాగతించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ''ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగా. నా నియోజకవర్గానికి వచ్చిన మోడీని సాదరంగా స్వాగతించా'' అని థరూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అధినాయత్వంతో శశిథరూర్ బంధం బీటలు వారుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా థరూర్ తన సొంత పార్టీపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ మధ్య ఓ కేంద్ర మంత్రితో ఆయన సెల్ఫీ దిగడంతో థరూర్ పార్టీ మారనున్నట్లు ప్రచారం మొదలైంది. ఇక, భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ పరిణామాల వేళ ఆయన మోడీతో వేదిక పంచుకోవడం చర్చనీయాంశమైంది.
ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టద్దు : నరేంద్ర మోడీ
May 02, 2025
0
Tags