రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలతకు 14 రోజులు రిమాండ్‌

Telugu Lo Computer
0


విశాఖపట్నం మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ చక్రపాణిని ఏసీబీ అధికారి పేరుతో ఇటీవల బెదిరించిన కేసులో తెర వెనుక చక్రం తిప్పిన రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలత బండారం బయటపడింది. ఈమెతో పాటు అధికారిగా హల్‌చల్‌ చేసిన బలగ సుధాకర్‌ను పీఎంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిని గురువారం భీమిలి కోర్టులో హాజరుపరచగా, 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు సీఐ జి.బాలకృష్ణ తెలిపారు. స్వర్ణలత ప్రస్తుతం బాపట్లలో రిజర్వు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. సెలవుపై ప్రస్తుతం విశాఖలోనే ఉన్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 6న సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ఏసీబీ సీఐగా వెళ్లిన బలగ సుధాకర్‌ 'త్వరలో ఏసీబీ రైడ్స్‌ ఉంటాయి. అంతా మేం చూసుకుంటాం. మా ఎస్పీ మేడంతో మాట్లాడండి' అంటూ ఫోన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌కు ఇచ్చారు. స్వర్ణలత ఏసీబీ ఎస్పీగా మాట్లాడుతూ 'సుధాకర్‌ చెప్పినట్లు చేయండి, అంతా మేం చూసుకుంటాం' అంటూ ఆదేశాలిచ్చినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. పోలీసు శాఖలో పని చేస్తున్న స్వర్ణలత ఘనకార్యాలు అన్నీఇన్నీ కావు. విశాఖలో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు 2023 జులైలో రూ.2 వేల నోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరిని బెదిరించి రూ.లక్షల్లో డబ్బులు గుంజారు. బాధితుల్లో ఒకరు నౌకాదళ విశ్రాంత అధికారి కావడంతో సీపీకి నేరుగా ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి స్వర్ణలతను జైలుకు పంపారు. స్వర్ణలత సినిమాలపై మక్కువతో ఓ పాటకు నృత్యం చేసి ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. విశాఖకు రిజర్వు ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన తర్వాత సినీ రంగంతో సంబంధం ఉన్న ఓ వైకాపా నేతతో పరిచయాలు పెంచుకున్నారు. ఆ తర్వాత పోలీసు అధికారిణి పాత్రలో 'ఏపీ 31' చిత్రంలో నటించడమే కాకుండా, నిర్మాణ వ్యవహారాల బాధ్యతలూ చూశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)