ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌కు ట్రంప్‌ పరోక్ష హెచ్చరిక

Telugu Lo Computer
0


ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విరుచుకుపడ్డారు. వడ్డీ రేట్లను వేగంగా తగ్గించడం లేదని రుసరుసలాడారు. 'ఫెడ్‌ ఛైర్‌ తొలగింపు అంత త్వరగా రాకూడదనే' అనుకుంటున్నానని పరోక్షంగా హెచ్చరించారు. పావెల్‌ పదవీ కాలం 2026 చివరి వరకు ఉంది. ఇమిగ్రేషన్, టాక్సేషన్, నియంత్రణలు, టారిఫ్‌ వంటి విధానపరమైన మార్పుల వల్ల ఆర్థిక వ్యవస్థపై కలిగే ప్రభావంపై ఫెడరల్‌ రిజర్వ్‌ స్పష్టత కోరుతోందని పావెల్‌ పేర్కొన్న మరుసటి రోజే ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 'యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) ఎపుడో రేట్లు తగ్గించేసింది. ఇకనైనా పావెల్‌ రేట్లు తగ్గించాల'ని ట్రంప్‌ సూచించారు. పావెల్‌ను 2017లో ట్రంప్‌ నామినేట్‌ చేశారు. ఆ తర్వాత 2022లో బైడెన్‌ మరో నాలుగేళ్ల పాటు నియమించారు. ట్రంప్‌ తనను రాజీనామా చేయమని అడిగినా తాను చేయనని నవంబరులో జరిగిన ఒక సమావేశంలో పావెల్‌ సంకేతాలిచ్చారు. ఫెడ్‌ అధికారుల తొలగింపు లేదా హోదా తగ్గింపునకు 'చట్ట పరిధి కింద అనుమతి లేద'ని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)