తెలంగాణలోని కరీంనగర్ లో చేపట్టిన టిటిడి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరుతూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. లేఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధిని చూడబోతున్నదని పేర్కొన్నారు. బిఆర్ నాయుడు నాయకత్వంలో తిరుమల తిరుపతిలో భక్తులంతా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ తగిన కృషి జరుగుతుందని బండి సంజయ్ తెలిపారు. ఇప్పటికే చేపట్టిన కొన్ని మంచి చర్యలు భక్తుల నుండి విశేషమైన ప్రశంసలను పొందుతున్నాయి అని పేర్కొన్న బండి సంజయ్ రెండేళ్లుగా పెండింగ్ పడిన కరీంనగర్ లో టిటిడి ఆలయ నిర్మాణానికి సహకరించాలని అంటూ లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారంతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణ అభివృద్దికి టీటీడీ చేస్తున్న కృషి నిరుపమానం అని కొనియాడారు. ధూప-దీప నైవేద్యాలకు నోచుకోని అనేక దేవాలయాలను ఆదుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు. ఇదే క్రమంలో కరీంనగర్లో టీటీడీ నిర్మించ తలపెట్టిన ఆలయం పైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. 2023లోనే కరీంనగర్ లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించిందని పేర్కొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ అదే ఏడాది మే 31న కరీంనగర్ లోని 10 ఎకరాల స్థలంలో భూమి పూజ కూడా జరిగిందని గుర్తు చేశారు.నాటి నుండి నేటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. టీటీడీ ఆలయ నిర్మాణం కోసం కరీంనగర్ సహా పొరుగు జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. టీటీడీ ఆలయ నిర్మాణ పనులు యుద్ద ప్రాతిపదికన కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోండని బండి సంజయ్ బిఆర్ నాయుడుకు సూచించారు. అద్భుతమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని నిర్మించడానికి సహకరించాల్సిందిగా మీకు విజ్ణప్తి చేస్తున్నాని బండి సంజయ్ అన్నారు. ఈ నిర్మాణ పనులు కొనసాగించేలా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానన్నారు.
ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరుతూ టీటీడీ చైర్మన్ కు బండి సంజయ్ లేఖ !
April 05, 2025
0
Tags