తెలంగాణలో నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 14 వరకు ప్రభుత్వం పొడిగించింది. ప్రభుత్వం 5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యం పెట్టుకుంది. ఈ పథకానికి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 17 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దరఖాస్తు కోసం రేషన్‌కార్డులేని వాళ్లకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరయ్యాయి. వీటి జారీలో సాంకేతికపరమైన ఇబ్బందులతో పాటు సిబ్బంది కొరత వల్ల తహసీల్దార్ కార్యాలయాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక ఉగాది, రంజాన్ వంటి సెలవులు రావడం వల్ల కూడా దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గడువు పెంచింది. గడువు పెంపు విషయాన్ని సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్ నుంచి చీఫ్ సెక్రటరీ, సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ మంత్రులు జిల్లాలకు వచ్చినప్పుడు పథకానికి సంబంధించిన ప్రగతి సమాచారం అందించి వారి నుంచి సలహాలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలకు పూర్తి సమాచారం ఇవ్వాలని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ మొదలుకొని గ్రౌండింగ్ వరకు నిరుద్యోగ యువత ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, అన్ని మండల, పురపాలక కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను భట్టి ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఒక యువ అధికారిని నియమించాలన్నారు. ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఎంపికైన లబ్ధిదారులకు పరిశ్రమల శాఖ ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. ఈ పథకం విజయవంతం కావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు పెంపు
April 01, 2025
0
Tags