భారత్‌కు బంగాళాఖాతంలో పొడవైన తీర రేఖ ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. బిమ్‌స్టెక్ బాధ్యతలపై భారత్‌కు సంపూర్ణ అవగాహన ఉందని పేర్కొన్నారు. సహకారం ఒక సమగ్ర దృక్పథం అని భారత్ విశ్వసిస్తుందని వ్యాఖ్యానించారు. థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న ఆరవ బిమ్‌స్టెక్ సదస్సులో ఆయన ఈమేరకు మాట్లాడారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఇటీవల బంగాళాఖాతంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తాజా స్పందన వచ్చింది. ''బంగాళాఖాతం చుట్టూ ఉన్న, దానికి సమీపంలోని దేశాలకు ఉమ్మడి ఆసక్తులు, ఆందోళనలు రెండూ ఉన్నాయి. వాటిలో కొన్నింటికి మన చరిత్ర దోహదం చేసింది. ఇతర ప్రాధాన్యాలు ఈ ప్రాంతం శ్రేయస్సును పక్కనపెట్టాయి. బంగాళాఖాతంలో భారత్‌కు 6,500కి.మీ. మేర పొడవైన తీరరేఖ ఉంది. భారతదేశం ఐదు బిమ్స్‌స్టెక్ సభ్య దేశాలతో సరిహద్దును కలిగి ఉంది. అలాగే ఆసియన్ దేశాలతో అనుసంధానాన్ని అందిస్తోంది. ముఖ్యంగా మా ఈశాన్య ప్రాంతం బిమ్స్‌స్టెక్ కనెక్టివిటీ హబ్‌గా వృద్ధి చెందుతోంది. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, గ్రిడ్‌లు, పైప్‌లైన్ నెట్‌వర్క్‌లతో ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం వరకు అనుసంధానం అవుతోంది. ఇది నిజంగా గేమ్ ఛేంజర్. ఈ విశాల భౌగోళిక ప్రాంతంలో వస్తువులు, సేవల సరఫరా, ప్రజల మధ్య సంబంధాలు సజావుగా సాగడానికి మన మధ్య సహకారం, సౌకర్యాలు అవసరమని మేం గ్రహించాం. ఈ భౌగోళిక, వ్యూహాత్మక పరిస్థితులను దృష్టిలోఉంచుకొని.. గత దశాబ్దకాలంగా బిమ్స్‌స్టెక్ బలోపేతం కోసం అత్యంత శ్రద్ధ వహిస్తున్నాం. ఈ సహకారం ఒక సమగ్ర దృక్పథం అని భారత్ విశ్వసిస్తుంది. నచ్చినవి ఎంచుకొని మిగిలినవి వదిలేయడం కుదరదు'' అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన యూనస్ భారత్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆగ్రహానికి కారణమయ్యాయి. ''భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా భూపరివేష్టితమైవున్నందున బంగాళాఖాతానికి మేమే సంరక్షకులం. ఇదొక పెద్ద ప్రయోజనానికి అవకాశం కల్పిస్తోంది. అందుకే మా దేశంలో పెట్టుబడులు పెట్టండి'' అని యూనస్ చైనాను ఆహ్వానించారు. యూనస్ తీరును మన దేశ నేతలు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ''ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం'' అని ఆందోళన వ్యక్తంచేశారు.
భారత్‌కు బంగాళాఖాతంలో 6,500కి.మీ. మేర పొడవైన తీరరేఖ ఉంది : ఎస్. జైశంకర్
April 03, 2025
0
Tags