డాలర్‌ను బలహీనపరిచే ప్రయత్నం చేయలేదు : కేంద్ర మంత్రి జైశంకర్

Telugu Lo Computer
0


మెరికన్ డాలర్‌ను బలహీనపరిచే ప్రయత్నం భారత్ చేయలేదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. అటువంటి ప్రయత్నాల్లో తమ జోక్యం లేదని స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాలు డాలర్‌తో ఆటలు ఆడాలనుకుంటే తాము వాణిజ్యంతో వారికి చెక్ పెడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో హెచ్చరించారు.''బ్రిక్స్‌ రెండు దశాబ్దాల కాలంగా సభ్యత్వం, ఎజెండా ఆధారంగా విస్తరిస్తోన్న వేదిక. అంతర్జాతీయ సమాజంలో బ్రిక్స్ కార్యకలాపాలపై అవగాహన పెంచేలా మా ప్రయత్నాలు ఉన్నాయి. ఈ కూటమి తన సభ్యుల ఉమ్మడి ఆందోళనను ప్రతిబింబిస్తుంది. ప్రపంచ దేశాలతో కలిసి ముందుకువెళ్తుంది. ఈ గ్రూప్ సమావేశాలు, చర్చలు ప్రపంచ క్రమాన్ని రూపొందించి, కలిసి పనిచేయడంపై లక్ష్యంగా ఉంటాయి. డాలర్‌ బలహీనపరిచే ప్రయత్నాల్లో, బ్రిక్స్‌కు కామన్ కరెన్సీని తీసుకురావడంలో భారత్ ప్రమేయం లేదు'' అని ట్రంప్ సుంకాల ముప్పు గురించి పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానం ఇచ్చారు. డాలర్‌పై దాడి చేయడం భారతదేశ ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక విధానంలో భాగం కాదని అమెరికాతో జరిపిన ద్వైపాక్షిక చర్చలలో భారత్‌ ఇదివరకే స్పష్టం చేసింది. గతేడాది అక్టోబరులో రష్యాలో బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీ రూపొందించడంపై దృష్టిసారించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం కూటమిలోని దేశాలు డిజిటల్‌ కరెన్సీ వాడుకునేందుకు భారత్‌తో కలిసి రష్యా పని చేస్తోందన్నారు. సభ్య దేశాలు కొత్త ఆర్థిక సాధనాలను వినియోగించుకోవాలని పుతిన్‌ కోరారు. దీనిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. కాగా అట్లాంటిక్ కౌన్సిల్‌కు చెందిన జియో ఎకనామిక్స్ సెంటర్ గత సంవత్సరం చేసిన అధ్యయనంలో బ్రిక్స్ దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా డాలర్‌పై ప్రపంచ దేశాలు ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించలేవని వెల్లడించింది. ఈనేపథ్యంలో బ్రిక్స్ సభ్యులు డాలర్‌కు బదులు మరో కరెన్సీని తీసుకొస్తే ఆ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)