తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగేపల్లి క్రాస్ రోడ్డు వద్ద శనివారం ఉదయం వ్యవసాయ కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో 16 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో పోలీసులు మంథనిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మంథని మండలంలోని బట్టుపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు మల్లారంలో మిర్చి ఏరేందుకు టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో మంథని- కాటారం ప్రధాన రహదారిపై నాగేపల్లి క్రాస్ రోడ్డు వద్ద ట్రాలీ స్టీరింగ్ రాడ్డు ఉడిపోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 16 మంది కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిలో బొందల కిష్టమ్మ, అప్పల శైలజ, అప్పల వనిత పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. మిగిలినవారిని పెద్దపల్లి, గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటళ్లకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాలీ బోల్తా : ముగ్గురి పరిస్థితి విషమం
March 22, 2025
0
Tags