గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన వలసదారులకు అమెరికాలో శాశ్వతంగా ఉండే హక్కు లభిస్తుందన్న గ్యారంటీ లేదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా తేల్చి చెప్పేశారు. దీంతో ఈ కార్డుల చెల్లుబాటుపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. అమెరికాలో ప్రస్తుతం గ్రీన్ కార్డులు శాశ్వత నివాస గుర్తింపుకు చిహ్నంగా ఉన్నాయి. విదేశీయులకు అమెరికాలో నివసించేందుకు, పని చేసుకునేందుకు ఇవి అవకాశం కల్పిస్తున్నాయి. కానీ ఇప్పుడు జేడీ వాన్స్ ప్రకటనతో ఇకపై అలాంటి గ్యారంటీ ఏమీ లేదని తేలిపోయింది. గ్రీన్ కార్డులపై శాశ్వత నివాసం అని ఉన్నంత మాత్రాన వారు శాశ్వతంగా ఇక్కడే ఉండేందుకు గ్యారంటీ లేదని జేడీ వాన్స్ తన ప్రకటనలో తెలిపారు. ఇది ప్రాథమికంగా వాక్ స్వాతంత్య్రానికి సంబంధించినది కాదని, ఇది జాతీయ భద్రత గురించి అని వ్యాఖ్యానించారు. కానీ అమెరికన్ ప్రజలుగా మన జాతీయ సమాజంలో ఎవరిని చేరాలని నిర్ణయించుకుంటామనే దాని గురించి కూడా ఇది చాలా ముఖ్యమైనది అని ఫాక్స్ న్యూస్‌లో "ది ఇంగ్రాహం యాంగిల్" హోస్ట్ లారా ఇంగ్రాహంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. విదేశాంగ కార్యదర్శి, అధ్యక్షుడు ఈ వ్యక్తి అమెరికాలో ఉండకూడదని నిర్ణయించుకుంటే, వారికి ఇక్కడ ఉండటానికి చట్టపరమైన హక్కు ఉండదని జేడీ వాన్స్ తేల్చిచెప్పేశారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో గత వసంతకాలంలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో పాల్గొన్నందుకు అరెస్టు చేసిన కొలంబియా విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్ విద్యార్థి మహమూద్ ఖలీల్ అరెస్టుపై స్పందిస్తూ వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖలీల్ గ్రీన్ కార్డ్‌ను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసిందని అతని న్యాయవాది చెప్పారు, కానీ విచారణ జరిగే వరకు అతన్ని బహిష్కరించే తక్షణ ప్రయత్నాన్ని న్యూయార్క్ ఫెడరల్ జడ్జి జెస్సీ ఫర్మాన్ అడ్డుకున్నారు. వాస్తవానికి నేరపూరిత కార్యకలాపాలు, దేశం నుండి ఎక్కువ కాలం గైర్హాజరు కావడం లేదా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను పాటించడంలో వైఫల్యం వంటి కొన్ని పరిస్థితులలో గ్రీన్ కార్డ్‌ను రద్దు చేయడానికి అమెరికా చట్టాలు అనుమతిస్తున్నాయి.
గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన వలసదారులకు శాశ్వతంగా ఉండే హక్కు లభిస్తుందన్న గ్యారంటీ లేదు !
March 14, 2025
0
Tags