ఓలా ఎలక్ట్రిక్ సేవలపై పోస్టు చేసి నెట్టింట వైరల్‌గా మారిన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోపై ఆయన విరుచుకుపడ్డారు. తమ డెలివరీ పార్ట్‌నర్లకు రేటింగ్ ఇవ్వాలంటూ సోషల్‌మీడియాలో జొమాటో పెట్టిన పోస్ట్‌పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగుల శ్రమను గుర్తించి సరైన వేతనం అందిచట్లేదన్నారు. ''కొందరు కస్టమర్లు డెలివరీ పార్ట్‌నర్లకు రేటింగ్ ఇవ్వడం లేదు. దీంతో తమ శ్రమకు గుర్తింపు దక్కడం లేదని చాలా మంది బాధపడుతున్నారు'' అంటూ 'ఎక్స్' వేదికగా జొమాటో పోస్ట్ చేసింది. దీనిపై కమ్రా స్పందించారు. ఉద్యోగుల కనీస వేతనం, వారి భద్రత గురించి ఏమాత్రం పట్టించుకోని కొందరు రేటింగ్ అడుగుతున్నారంటూ అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే కునాల్ కమ్రా జొమాటోపై విమర్శలు గుప్పించడం ఇదే తొలిసారి కాదు. 2024 జూన్‌లో జొమాటో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నప్పుడు సైతం ఇలాగే పోస్టులతో విరుచుకుపడ్డారు. ''గత 3 నెలల్లో డెలివరీ ఏజెంట్ల సగటు ఆదాయం, పని గంటలు, డెలివరీ భాగస్వాముల సంఖ్య ఎంత ఉందో ప్రకటించగలరా? చేయలేరు. కానీ ఒక్క రోజులో ఎన్ని బిర్యానీ ఆర్డర్లు వచ్చాయో మాత్రం చెప్తారు'' అని అన్నారు.
కనీస వేతనం ఇవ్వరు, రేటింగ్ కావాలా ?
March 14, 2025
0
Tags