జగన్ హయాంలో ట్రాన్స్‌ఫార్మర్ కొనుగోళ్లన్నీ ఒక్క కంపెనీకే కట్టబెట్టారు !

Telugu Lo Computer
0

వైసీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతం ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్లన్నీ ఒక్క కంపెనికే కట్ట బెట్టరారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. శాసన సభలో గురువారం నాడు ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి సమాధానం చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క విద్యుత్ స్తంభాన్నీ మార్చలేదనీ, మరమత్తులకు గురైన ట్రాన్స్ ఫార్మర్లనూ బాగు చేయలేదని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాతే... విరిగిన విద్యుత్ స్తంభాలను మార్చడంతో పాటు పాడైన ట్రాన్స్ ఫార్మర్లకు మరమత్తులు చేయిస్తున్నట్లు ఆయన వివరించారు. రాజా నగరం నియోజకవర్గ పరిధిలో అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లను ఈ వేసవిలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఒక్క కంపెనీకే 90 శాతం కొనుగోళ్లను అప్పగించారని వెల్లడించారు. ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో టెండర్ పిలిచిన 10,000 ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోళ్లలో ఎమ్ఎస్ఎస్ఈ లను ప్రోత్సహిస్తామన్నారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చేయడానికి... ఎస్పీడీసీఎల్ పరిధిలో 22 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని, దీనికి సంబంధించిన టెండర్లునూ పిలుస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి ప్రకటించారు. అదే విధంగా టెండర్లలో ఎక్కువమంది పాల్గొనే విధంగా చూస్తామన్నారు. లోడ్ ఆధారంగా రైతులకు ట్రాన్స్ ఫార్మర్లు అందజేస్తామని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల ధరలు తగ్గించే విషయంలోనూ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. విద్యుత్ శాఖ బృందం సభ్యులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి ధరలపై అధ్యయనం చేశారని తెలిపారు. అధ్యయనం తరువాత... గతంలో రూ.4,600., ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఇప్పుడు రూ.3,750కు తగ్గించామని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో ట్రాన్స్‌ ఫార్మర్ల ధరలనూ 20 శాతంపైగా తగ్గించామన్నారు. నాణ్యత తగ్గకుండా కేవలం ధర మాత్రమే తగ్గేలా చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. అదే విధంగా రైతులకు, పారిశ్రామిక, వ్యాపార అవసరాలకు తగ్గట్టు వినియోగించే 25 కేవీ, 40 కేవీ, 63 కేవీ వంటి ట్రాన్స్ ఫార్మర్లను నాణ్యత తగ్గకుండా తక్కువ ధరలకు అందుబాటులో తెచ్చేలా సంబంధిత టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)