మోడీ ప్రభుత్వంపై పోరుకు దక్షిణాది రాష్ట్రాలకు రేవంత్ పిలుపు !

Telugu Lo Computer
0


కేరళలోని తిరువనంతపురంలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ  దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. రాజ్యాంగ బద్ధంగా మనకు రావాల్సిన హక్కులు సాధించుకునేందుకు పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్, డీలిమిటేషన్ ఎజెండాతో మోడీ ముందుకు సాగుతున్నారన్నారు. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. పార్లమెంట్ స్థానాలు తగ్గుతాయని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించడం వల్ల పార్లమెంట్ స్థానాలకు గండిపడే ప్రమాదం ఉందన్నారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు గళం విప్పాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతోందని, ఒక ట్రిలియన్ ఎకనామీ లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించిందన్నారు. దీంతో దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 25 వేల కోట్ల పెట్టుబడులే తెచ్చిందని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలల వ్యవధిలోనే 1.82 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిందని రేవంత్ వెల్లడించారు. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకరించుకున్నా తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నగరాన్ని క్లీనెస్ట్, సేఫెస్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు మూడువేల ఈవీ బస్సులను కొనుగోలు చేశామన్నారు. అంతేగాక, గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో సంస్థలను ఆకర్షించగలిగామన్నారు. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్మా రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టామని సీఎం రేవంత్ వివరించారు. యువతలో ఉన్న నైపుణ్యాలను బయటకు తెచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)