తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రంగరాజన్ ఇంట్లో ఉన్న సమయంలో ఆయనపై కొందరు దాడి చేసినట్టు స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. ''నాపై 20 మంది దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మిగతా వివరాలు విచారణలో తెలుస్తాయి. ఇంతకు మించి దీనిపై మాట్లాడను'' అని రంగరాజన్ తెలిపారు. దాడి ఘటనను వివరించేందుకు ఆయన నిరాకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలోని రంగరాజన్ నివాసానికి శుక్రవారం కొందరు వ్యక్తులు వచ్చారు. రామరాజ్యం స్థాపనకు మద్దతివ్వాలని కోరారు. అందుకు ఆయన నిరాకరించడంతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని కుమారుడిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రంగరాజన్‌పై దాడి కేసుకు సంబంధించి ఆదివారం ఒకరిని అరెస్టు చేసినట్టు మొయినాబాద్ పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో వీరరాఘవరెడ్డిని అరెస్టు చేశామని, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.
చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు రంగరాజన్‌పై దాడి !
February 09, 2025
0
Tags