అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ప్రత్యేక విమానంలో వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. మొత్తంగా 104 మంది ఆ విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. దీంతో అమెరికా కలలు కంటూ తమ కుటుంబాలకు మంచి జీవితం ఇద్దామనుకొని అక్కడికి వెళ్లిన వారి ఆశలు అడియాశలయ్యాయి. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. ఈక్రమంలో వారి దీనగాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.అమెరికాలో వర్క్ వీసా ఇప్పిస్తానని నమ్మబలికిన ఏజెంట్‌కు రూ.42 లక్షలు ఇచ్చి హర్వీందర్ సింగ్ దారుణంగా మోసపోయాడు. ఆయనది పంజాబ్‌లోని హోషియాపుర్‌కు చెందిన తహ్లీ గ్రామం. తర్వాత వీసా రాలేదని చెప్పడంతో ఢిల్లీ నుంచి ఖతర్, అక్కడి నుంచి బ్రెజిల్ వెళ్లి నానాయాతన పడుతూ అమెరికా వెళ్లాడు. ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్‌తో ఉన్న డబ్బు పోయి, ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడికే వచ్చి నిల్చున్నారు. సింగ్ మీడియాతో మాట్లాడుతూ ''ఎలాగోలా బ్రెజిల్ చేరితే తర్వాత పెరూలో విమానం ఎక్కిస్తానని చెప్పారు. కానీ అలాంటి ఏర్పాటు ఏదీ చేయలేదు. తర్వాత ట్యాక్సీల్లో కొలంబియా, పనామా తీసుకెళ్లారు. అక్కడి నుంచి నౌక ఎక్కిస్తామన్నారు. అదీ లేదు. రెండురోజుల పాటు అక్రమమార్గంలో ప్రయాణించాం. తర్వాత పర్వతమార్గంలో ముందుకెళ్లాం. మెక్సికో సరిహద్దుకు వెళ్లడం కోసం మమ్మల్నందరినీ ఒక చిన్న బోటులో కుక్కేశారు. అందులో నాలుగు గంటలు ప్రయాణించిన తర్వాత బోటు తిరగబడింది. దానివల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పనామా అడవిలో మరొకరు చనిపోయారు'' అని వాపోయారు. దారాపుర్ గ్రామానికి చెందిన సుఖ్‌పాల్ సింగ్ కూడా ఇలాంటి దుస్థితినే ఎదుర్కొన్నారు. 15 గంటల పాటు సముద్ర ప్రయాణం చేసి, దాదాపు 45 కి.మీ. పర్వతమార్గంలో ముందుకెళ్లారు. ''ఎవరైనా గాయపడితే వారి పరిస్థితి అంతే. మిగిలేది మరణమే. దారివెంట ఎన్నో మృతదేహాలను చూశాం. ఇక కొద్దిసేపట్లో మెక్సికో సరిహద్దు దాటి అమెరికాలో అడుగుపెడతామనగా జలంధర్‌కు చెందిన ఓ వ్యక్తి అరెస్టు కావడంతో మా ప్రయణం అంతా వృథా అయింది. దాంతో మమ్మల్ని 14 రోజులపాటు చీకటి గదుల్లో బంధించారు. సూర్యుడు జాడే లేకుండా పోయింది. అక్కడ వేలాది మంది పంజాబీ కుటుంబాలకు చెందిన యువకులు, పిల్లలు కనిపించారు. అందరిదీ ఒక్కటే దుస్థితి. ఇలా అక్రమమార్గంలో విదేశాలకు వెళ్లొద్దని కోరుతున్నా'' అని సుఖ్‌పాల్ ఆవేదన వ్యక్తంచేశారు.
అమెరికాలో భారత అక్రమ వలసదారుల వెతలు !
February 06, 2025
0
Tags