మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాజకీయ పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలను, సూచనలను తాము గౌరవిస్తున్నామని, త్వరలో లిఖితపూర్వకంగా స్పందిస్తామని పేర్కొంది. మహారాష్ట్ర ఓటర్లకు సంబంధించి పూర్తి వాస్తవాలు, విధానపరమైన అంశాలతో కమిషన్ సమాధానం ఇస్తుందని తెలిపింది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రతిపక్షాలకు చెందిన పార్టీలు ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఓటర్ల సంఖ్యపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. అట్టడుగు వర్గాలకు చెందిన ఎందరో ప్రజల ఓట్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారని, కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లు ఉన్నా అక్కడి ఓటర్లను మరో కేంద్రానికి మార్చారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలు తమకు ఇవ్వాలని ఈసీని కోరామని.. దీనిద్వారా కొత్తగా చేరిన ఓటర్లు ఎవరనేది కచ్చితంగా అర్థమవుతుందని తెలిపారు. అలాగే, ఎంతమంది ఓటర్లను తొలగించారో, ఒక బూత్‌నుంచి మరొక బూత్‌కు ఎందుకు బదిలీ చేశారో తెలుస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా లేదు గనకే ఓటర్ల జాబితాను తమకు ఇచ్చేందుకు ఎన్నికల సంఘం ఆసక్తి చూపడంలేదని రాహుల్ ఆరోపించారు.
మహారాష్ట్ర ఓటర్ల జాబితా ఆరోపణలపై రాతపూర్వకంగా స్పందిస్తాం : కేంద్ర ఎన్నికల సంఘం
February 07, 2025
0
Tags