మహాకుంభ మేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై సమాజ్‌వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పార్లమెంటులో చేసిన విమర్శలపై బీజేపీ ఎంపీ హేమమాలిని స్పందించారు. ఘటన జరిగినది నిజమే అయినా, మరీ అంత పెద్దది కాదని, అతిశయోక్తులు జోడించి మరీ పెద్దదిగా చిత్రీకరించరాదని అన్నారు. మహాకుంభ్ నిర్వహణను అఖిలేష్ నిలదీస్తూ, మహాకుంభ్ ఏర్పాట్లపై మాట్లాడానికి బదులుగా ఆ ఆవెంట్‌ను ప్రచారం చేసుకునేందుకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిమితమైందనన్నారు. 100 కోట్ల మంది భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశామని బీజేపీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అమృత్‌స్నాన్ సకాలంలో నిర్వహించడంలో విఫలమైందని ఆరోపించారు. తొక్కిసలాట మృతుల లెక్కల్ని ప్రభుత్వం తొక్కిపెట్టిందని, సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు జేసీబీలను ఉపయోగించిందని అన్నారు. మహాకుంభ్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ఈవెంట్ నిర్వహణకు ఆర్మీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. హేమమాలిని మీడియాతో మాట్లాడుతూ మహాకుంభ్ మేళా నిర్వహణ చాలా చక్కగా ఉందని, ఏర్పాట్లు బాగా చేశారని అన్నారు. ''మేము కుంభమేళా వెళ్లాం. పవిత్ర స్నానం ఆచరించాం. కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన మాట నిజమే. కానీ అది మరీ అంత పెద్ద ఘటన కాదు. ఈ ఘటనను పెద్దదిగా చేసి చూపుతున్నారు. అంతమంది వస్తున్నప్పుడు నిర్వహణ కష్టమే అయినప్పటికీ యూపీ ప్రభుత్వం చాలా బాగా నిర్వహిస్తోంది'' అని అన్నారు.
తొక్కిసలాట ఘటనకు అతిశయోక్తులు జోడించి మరీ పెద్దదిగా చిత్రీకరించొద్దు : హేమమాలిని
February 04, 2025
0
Tags