ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ గులియన్-బారీ సిండ్రోమ్ (జీబీఎస్)తో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చుపడి పోవడంతో కొన్ని రోజులుగా వెంటిలేటపై చికిత్స పొందుతున్న బాధితురాలు ఇవాళ సాయంత్రం కన్నుమూసింది. కమలమ్మ మృతిని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి ధ్రువీకరించారు. అరుదుగా లక్షమందిలో ఒకరిద్దరికే వచ్చే జీబీఎస్ అనే నరాల సంబంధిత వ్యాధి కేసులు ఏపీలో ఇటీవల ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి (జీజీహెచ్) ఈ నెల 11న ఒక్కరోజే ఏడు కేసులు వచ్చాయి. ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి నలుగురు, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముగ్గురు ఈ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. వారిలో ఇద్దరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అదే వ్యాధితో కాకినాడలో ఇటీవల ఇద్దరు చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఈ వ్యాధితో 17 మంది చికిత్స పొందుతున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినా... అప్రమత్తంగా ఉండాల్సినదే. ఇది ఒకరకంగా పక్షవాతం లాంటిదే. చాలావరకు ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లు వచ్చినవారికే మొదలవుతుంది. వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చుబడతాయి. వ్యాధి లక్షణాల్ని సకాలంలో గుర్తించి చికిత్స పొందితే ప్రమాదకరం కాకముందే నయం చేయవచ్చు. ముఖ్యంగా కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఇది వ్యాపిస్తుంది. పెద్దవారికే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు పిల్లలు, శిశువులకూ సోకడం ఆందోళన కలిగిస్తోంది.
గుంటూరులో జీబీఎస్ చికిత్స పొందుతూ మహిళ మృతి
February 16, 2025
0
Tags