కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని భాజపాఎంపీలు యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్‌సభలో రాహుల్ మాట్లాడుతూ పదేపదే చైనా పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. కాగా ఆయన చెప్పేవన్నీ అబద్ధాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించడంతో లోక్‌సభలో వాతావరణం వేడెక్కింది. రాహుల్ తాను చేసిన ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు అందించడంలో విఫలమైతే ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీపై భాజపా ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభోపన్యాసం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ అభ్యంతరకర పదాలు వాడినందువల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. లోక్‌సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ తయారీ రంగంలో భారత్ కంటే చైనా పదేళ్లు ముందుందన్నారు. ఆ దేశానికి చెందిన మోటార్లు, బ్యాటరీలు, ఆప్టిక్స్‌ల దిగుమతులపై ఇప్పటికీ భారత్ ఆధారపడటాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రధాని మోడీ చేపట్టిన 'మేకిన్ ఇండియా' విఫలం కావడం వల్లే బీజింగ్ నుంచి వస్తువులు దేశంలోకి వస్తున్నాయని ఆయన ఆరోపించారు.
రాహుల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ?
February 04, 2025
0
Tags