టాటా ప్లే, ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ త్వరలో విలీనం ?

Telugu Lo Computer
0


టాటా ప్లే, ఎయిర్‌టెల్‌ డిజిటల్ టీవీ విలీనం కానున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఇరు సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. లైవ్‌ స్ట్రీమింగ్‌ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో డైరెక్ట్‌- టు- హోమ్‌  కస్టమర్‌ బేస్‌ క్రమంగా తగ్గిపోతోంది. ఈ తరుణంలో ఇరు సంస్థలు విలీనం కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆంగ్ల మీడియా సంస్థ 'ఎకనామిక్‌ టైమ్స్‌' తన కథనంలో పేర్కొంది. ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ, టాటా ప్లే విలీనం షేర్ల మార్పిడి ద్వారా జరగనుంది. ఒకవేళ ఈ విలీనం పూర్తయితే సంయుక్త సంస్థలో ఎయిర్‌టెల్‌ 50శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉండనుందని తెలుస్తోంది. ఎయిర్‌టెల్‌ తన బ్రాడ్‌బ్యాండ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ వ్యాపారాన్ని వృద్ధి పథంలో నడిపించేందుకు ఈ ఒప్పందం సాయపడనుంది. తన నాన్‌ మొబైల్‌ సెగ్మెంట్‌ నుంచి వచ్చే ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఈ విలీనం ఉపయోగపడనుంది. విలీనంతో టాటా ప్లేకు చెందిన దాదాపు 20 మిలియన్ల కనెక్షన్లకు ఎయిర్‌టెల్ తన సేవల్ని అందించనుంది. డీ2హెచ్‌ ఆదరణ తగ్గుతూ పూర్తిగా డిజిటల్‌ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ఈ విలీనం కోసం జరుపుతున్న చర్చలు ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌లో అతిపెద్ద డీటీహెచ్‌ ప్రొవైడర్‌ అయిన టాటా స్కై.. టాటా ప్లేగా పేరు మార్చుకుంది. న్యూస్‌ కార్ప్‌తో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటుచేసింది. 2019లో జరిగిన ఒప్పందంతో టాటా ప్లేలోని కొంత వాటాను వాల్ట్ డిస్నీ కైవసం చేసుకుంది. టాటా ప్లే, ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ విలీనం జరిగితే.. 2016లో టాటా డీ2హెచ్‌, డిష్‌ టీవీ విలీనం తర్వాత.. రెండు సంస్థల మధ్య జరగనున్న రెండో ఒప్పందం కానుంది. విలీనమైన కంపెనీని ఎయిర్‌టెల్ సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. సంయుక్త సంస్థలో డిస్నీ వాటాను కలిగిఉంటుందని నివేదిక పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)