సోషల్ మీడియా ప్రభావంతో ఏటికొప్పాక బొమ్మలకు డిమాండ్ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలోని ఏటికొప్పాక గ్రామం. అంకుడు కర్రతో అద్భుతమైన బొమ్మలు తయారుచేసే ఊరు. ఈ గ్రామంలో ప్రజలు ఈ బొమ్మల తయారీపైనే జీవనం సాగిస్తుంటారు. ఈ బొమ్మలకి 400 వందల ఏళ్ల చరిత్ర ఉంది. వరాహ నది పక్కనే ఈ గ్రామం ఉంటుంది. దీంతో ఒకవైపు నది పరవళ్లు. మరోవైపు కళాకారులు అందమైన బొమ్మలను చెక్కుతున్న శబ్ధాలు పోటీపడుతున్నట్లు ఉంటాయి. ఇక్కడ బొమ్మలకు సహజ రంగులద్దుతారు. ఏటికొప్పాక హస్త కళాకారుల నైపుణ్యానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ ఓ సారి ఈ బొమ్మల గురించి ప్రస్తావన చేశారు. దీంతో ఈ బొమ్మల విశిష్టత మరింత పెరిగింది. దేశవ్యాప్తంగా ఏటికొప్పాక బొమ్మలు ప్రాముఖ్యత సంపాదించాయి. ఏటికొప్పాక బొమ్మ చేయటమంటే ఓ జీవికి ప్రాణం పోసినట్లే. చుట్టుపక్కల ఉండే అడవులలో దొరికే అంకుడు చెట్ల కొమ్మలను తెచ్చి ఎండబెట్టి ఈ బొమ్మలను తయారు చేస్తారు. చెవి దుద్దులు, గాజులు, షార్క్ చేప నుండి తిమింగలాలు వరకు, గోడలకు వేలాడదీసే అలంకరణలు, గోడ గడియారాలు, అలంకరణ వస్తువులు ఇంకా ఎన్నో వస్తువులను ఏటికొప్పాక కళాకారులు తయారు చేస్తారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ బొమ్మలు మధ్యలో కాస్త ఆదరణ కరువైనప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్ కు సైతం వెళ్తుందని కళాకారులు సంతోషం అంటున్నారు. సోషల్ మీడియా రానంతవరకు ఏటికొప్పాక కళాకారులు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి సంతల్లో, విశాఖపట్నం సిటీలో ఇలా అమ్మకాలు చేసుకునేవారు. ఒక్కొక్క సమయంలో ఈ బొమ్మలు కావాలంటే ఆ గ్రామానికి వెళ్లి కొనుక్కోవాలి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో తమకు మంచి ఆదాయం లభిస్తుందని కళాకారులు అంటున్నారు. తాము ఏదైనా మంచి వస్తువు తయారు చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో పెడితే ఇతర దేశాలు వారు సైతం కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. తాము తయారు చేసిన బొమ్మలు అమ్మకం చేయడానికి సోషల్ మీడియా ద్వారా మంచి ప్లాట్ఫారం దొరికిందని అంటున్నారు. శుభ కానుక అనే ఇన్స్టాగ్రామ్ ద్వారా తాము అమ్మకాలు చేస్తున్నామని ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చని అంటున్నారు. ఏటికొప్పాక బొమ్మలు అని కొట్టగానే మా పేజీలు కనిపిస్తాయని అక్కడ కొనుగోలు చేయవచ్చని అంటున్నారు. ప్రస్తుతం యువత అంతా బిజీబిజీగా బొమ్మలు తయారీలో ఉన్నారని అంటున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత తమ జీవితాల్లో వెలుగులు నింపిందని అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)