ప్రభుత్వం వద్ద ఉన్న డబ్బుతో దేశం అంతా సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని పిటిషన్ వేసిన వ్యక్తిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖజానా నుంచి వచ్చే డబ్బును పేదలకు ఇళ్లు, ఆరోగ్యం, విద్యా మొదలైన సౌకర్యాలు కల్పించడానికి వినియోగించాలా లేక దేశంలో సైకిల్ ట్రాక్‌లు వేయడానికి ఉపయోగించాలా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. అనేక నగరాల్లో పేద ప్రజలు సరైన నివాసాలు లేక మురికి వాడల్లో నివసిస్తున్నారని, వారికి సరైన ఆరోగ్య, విద్యా సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేసింది. దేశ ప్రజల సమస్యలు వదిలేసి సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు గురించి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మీ ఆలోచన చాలా గొప్పదని చురకలు అంటించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది మాట్లాడుతూ ఎంపిక చేసిన నగరాలు, పట్టణాలలో ప్రాథమిక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించే అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ స్కీమ్‌ను ప్రస్తావించారు. దీని కింద అనేక రాష్ట్రాల్లో సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేశారని తెలిపారు. చలి కాలంలో విపరీతమైన మంచు, వాయుకాలుష్యం వల్ల దేశ రాజధానిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, సైకిల్ ట్రాక్‌లు నిర్మించడం వల్ల వాటిని కొంత మేరకు నివారించే అవకాశం ఉందని పేర్కొన్నారు. పిటిషనర్ కోరిన విధంగా ప్రభుత్వాలు చేస్తాయని అనుకోవడం అతడి పగటి కలే అవుతుందని పేర్కొంటూ న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.
దేశ సంపద పేదల కోసమా - సైకిల్ ట్రాక్ కోసమా? : సుప్రీం కోర్టు ఆగ్రహం
January 15, 2025
0
Tags