డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చి కావేరి ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతినడంతో పాటు బస్సులోని ఏడుగురికి గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై సింగరాయకొండ మండల పరిధిలో జీవీఆర్ ఆక్వా కంపెనీ సమీపంలోని ఫ్లై ఓవర్‌పై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బస్సు వెళ్తుండగా, తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా గోసాలపేటకు చెందిన చెనగల మహేష్, బాలాపూర్‌కు చెందిన ఈదుల మురళీధర్, మరాఠి హల్వాల్‌కు చెందిన పతంగి సూర్యప్రకాష్, పతంగి రామ్‌కుమార్, గనీత్‌నావునక్, మియాపూర్‌కు చెందిన మరకవీరేందర్‌తో పాటు తిరుపతి జిల్లా కాళహస్తికి చెందిన సురాతి విజయ్‌సాయికుమార్‌కు గాయాలయ్యాయి. వీరిని 108లో ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. మిగతా వారికి గాయాలు లేవని, సురక్షితంగా ఉన్నారని ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే టంగుటూరు హైవే మొబైల్ పోలీసులు, స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితులను త్వరితగతిన ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు.