కిర్గిజ్‌స్థాన్‌లో విదేశీ విద్యార్థులపై దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. కిర్గిజ్‌స్థాన్‌లో ఉన్న భారత పౌరులు వారు ఉంటున్న నివాసాల్లోనే ఉండాలని, బయటకు రావొద్దని కోరింది. కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మూక హింస చెలరేగుతున్న నేపథ్యంలో కిర్గిజ్‌స్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బిష్కెక్‌లో ఉంటున్న భారత విద్యార్థులు ఇండోర్స్‌లోనే ఉండాలని సూచించింది. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని.. అయితే విద్యార్థులు ప్రస్తుతానికి వారి నివాసాల లోపలే ఉండాలని కోరింది. ''మేము మన విద్యార్థులతో సంప్రదింపులు జరుపుతున్నాము. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. అయితే విద్యార్థులు ప్రస్తుతానికి ఇంటి లోపలే ఉండాలని కోరడం జరిగింది. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎంబసీని సంప్రదించాలని సూచించారు. 24×7 మా నెంబర్ 0555710041 లో సంప్రదించవచ్చు'' భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పేర్కొంది. విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ కూడా రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉండాలని విద్యార్థులకు సూచించారు. ''బిష్కెక్‌లో భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని పర్యవేక్షిస్తున్నాము. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని నివేదించబడింది. రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉండాలని విద్యార్థులకు సలహా ఇవ్వడం జరిగింది'' అని జై శంకర్ పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వెళ్లిన విద్యార్థులు నివసించే బిష్కెక్‌లోని వైద్య విశ్వవిద్యాలయాల హాస్టళ్లను అల్లరి మూక లక్ష్యంగా చేసుకుంది. ఇదిలాఉంటే, మే 13న కిర్గిజ్, ఈజిప్టు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు శుక్రవారం ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో సమస్య తీవ్రమైందని పాకిస్థాన్ రాయబార కార్యాలయం తెలిపింది. బిష్కెక్‌లో చోటుచేసుకున్న మూక దాడిలో ముగ్గురు పాకిస్థానీ విద్యార్థులు మరణించారని సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు పేర్కొనగా, తమకు ఇంకా ఎవరికీ మరణ నివేదిక అందలేదని ప్రభుత్వం తెలిపింది.
కిర్గిస్థాన్‌లో భారత పౌరులు బయటకు రావొద్దు !
May 18, 2024
0
Tags