నీట్‌ కటాఫ్‌ తగ్గే అవకాశం ?

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షలో ఫిజిక్స్‌ పేపర్‌ ప్రశ్నలు కఠినంగా ఉండటంతో విద్యార్థులు కాస్త ఇబ్బందిపడ్డారు. కానీ, మొత్తంమీద నీట్‌ పేపర్‌ మధ్యస్థంగా ఉన్నట్టు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈసారి అత్యధికంగా ప్రశ్నలను ఎన్సీఈఆర్టీ సిలబస్‌ నుంచే ఇచ్చారు. ఎప్పుడూ కఠినంగా ఉండే కెమిస్ట్రీ సులభంగా ఉండగా, జీవశాస్త్రంలో జువాలజీ, బాటనీ సెక్షన్ల ప్రశ్నలు కూడా ఈజీగా ఉన్నట్టు విద్యార్థులు చెప్పారు. బాగా చదివిన వారు, మరీ ముఖ్యంగా ఎన్సీఈర్టీ పుస్తకాలు, సిలబస్‌ చదివిన వారు మెరుగైన స్కోర్‌ చేస్తారని నిపుణులు అంచనావేశారు. అయితే, నిరుటితో ఈ సారి పేపర్‌ను పోల్చితే కాస్త కఠినంగా ఉన్నట్టు లెక్చరర్లు అంచనా వేశారు. ఈ సారి ఫిజిక్స్‌ ఆధారంగా ర్యాంకులను నిర్ణయించనున్నట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) గతంలోనే ప్రకటించింది. గత రెండు మూడేండ్లుగా కెమిస్ట్రీని ప్రామాణికంగా తీసుకొని ర్యాంకులను వెల్లడిస్తున్నారు. ఈ ఏడాది ఫిజిక్స్‌ కఠినంగా రాగా, ఈ నేపథ్యంలో ఒకే మార్కుపై ఉండే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిరుడు 700- 720 మధ్య మార్కులు పొందిన వారు అధికంగా ఉండగా, ఈ సారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది కన్వీనర్‌ కోటా సీట్లు పెరగడం, పేపర్‌ కఠినంగా రావడంతో తెలంగాణలో జనరల్‌ కటాఫ్‌ 430 -440 మార్కుల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఇక రిజర్వ్‌డ్‌ క్యాటగిరీ విద్యార్థుల కటాఫ్‌ 350 వరకు ఉండొచ్చని పేర్కొంటున్నారు. నీట్‌ పరీక్ష సందర్భంగా పలు పరీక్షాకేంద్రాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా టీచర్లు ముచ్చటించుకోవడంతో విదార్థుల ఏకాగ్రతపై ప్రభావం చూపింది. ఇక మాదాపూర్‌లో ఓ పాఠశాల సెంటర్‌లో ఇన్విజిలేటర్‌ 20 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రాన్నిచ్చారు. దీంతో ఆయా సెంటర్‌లోని 50 మంది విద్యార్థులు 20 నిమిషాల విలువైన సమయాన్ని కోల్పోయారు. ఇన్విజిలేటర్‌ వాచ్‌ ఆగిపోవడం, ఇది చూసుకోకుండా టీచర్‌ ప్రశ్నపత్రాలివ్వకపోవడంతో తమకు నష్టం వాటిల్లిందని విద్యార్థులు వాపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)