భారతీయుల కోసం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్లు !

Telugu Lo Computer
0


గాజాలో ఉన్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. 'ప్రస్తుతం నెలకొన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా పాలస్తీనాలోని భారతీయులు ఎవరైనా సరే తమకు అత్యవసర పరిస్థితి ఎదురైతే భారతదేశ ప్రతినిధి కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చు. వారికి సహాయం చేయడానికి ఈ అత్యవసర హెల్ప్‌లైన్‌ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని' పాలస్తీనాలోని భారత రాయబార కార్యాలయం ట్విటర్‌లో (ఎక్స్‌) ఒక ప్రకటనను పోస్టు చేసింది. ఇజ్రాయెల్‌పై శనివారం హమాస్‌ ముప్పేట దాడి చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్‌ రక్షణ దళం (ఐడీఎఫ్‌) ప్రతీకార దాడిని ప్రారంభించింది. ముఖ్యంగా గాజాలో దాక్కున్న ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు యత్నిస్తోంది. యుద్ధం కారణంగా రెండు దేశాల్లో దాదాపు 3600 మంది మరణించారు. వేల మంది ప్రజలు గాయపడ్డారు. అత్యంత దారుణ స్థితిలో ఉన్న 1200 మృతదేహాలను ఇజ్రాయెల్‌ ఆర్మీ బృందాలు గుర్తించాయి. వాటిలో అధికశాతం ఆయుధ రహితులైన సామాన్యులవి కావడం గమనార్హం. తమ దేశంలోనూ రద్దీగా ఉండే పాలస్తీనియన్‌ ఎన్‌క్లేవ్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల కారణంగా 1,055 మంది మరణించినట్లు గాజా అధికారులు వెల్లడించారు. హమాస్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో గాజాలో వెయ్యికిపైగా భవనాలు నేలమట్టమైనట్లు సమాచారం. సుమారు 23 లక్షల మంది ప్రజలకు నీరు, ఆహారం, విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలిసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే 2.6 లక్షల మంది గాజాను వీడారని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ వెల్లడించింది. ఇదిలా ఉండగా సామాన్య పౌరులు ఎన్‌క్లేవ్‌ నుంచి తప్పించుకోవడానికి వీలుగా 'మానవతా కారిడార్‌'ను ఏర్పాటు చేయాలని యూరోపియన్‌ యూనియన్‌ పిలుపునిచ్చింది. భారత విదేశాంగ మంత్రిత్వశాఖ సైతం ఢిల్లీలో కంట్రోల్‌ రూం, టెల్‌ అవీవ్‌, రమల్లాలో వేర్వేరు హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సుమారు 18వేల మంది భారతీయులు ఇజ్రాయెల్‌లో ఉన్నట్లు తెలిసింది. వారికి హాని జరిగినట్లు ఇంతవరకు ఎలాంటి సమాచారం వెలువడలేదు.

ఫోన్‌ నంబర్ల వివరాలు : ఢిల్లీ కంట్రోల్‌ రూమ్ 1800118797 (టోల్ ఫ్రీ), +91-11 23012113, +91-11-23014104, +91-11-23017905 +919968291988, ఈ-మెయిల్‌: situationroom@mea.gov.in. టెల్‌ అవీవ్‌ నంబర్లు: +97235226748, +972-543278392, ఈ-మెయిల్‌ cons1.telaviv@mea.gov.in. రమల్లా నంబర్‌ : +970-592916418 (వాట్సప్‌ అందుబాటులో ఉంటుంది), ఈ-మెయిల్‌ rep.ramallah@mea.gov.in.

Post a Comment

0Comments

Post a Comment (0)