తంగరాసు రంగసామి, నాగూరన్ బాలసుబ్రమణియన్ భారతీయులు. వర్క్ వీసా ద్వారా వేర్వేరుగా సింగపూర్ చేరుకున్న వారిద్దరూ అక్కడ కార్మికులుగా పని చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న నాగూరన్, 33 ఏండ్ల రామమూర్తి అనంతరాజ్ కలిసి వసతి గృహంలో మద్యం సేవించారు. కాగా, వారికి కొంత దూరంలో కూర్చొన్న తంగరాసు మద్యం మత్తులో అరవసాగాడు. రామమూర్తి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. జోక్యం చేసుకున్న నాగూరన్, వారిద్దరినీ విడదీసేందుకు ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో నాగూరన్ ఎడమ చేతి చూపుడు వేలు తంగరాసు నోట్లోకి వెళ్లింది. దీంతో అతడు ఆ వేలును గట్టిగా కొరికిపట్టుకున్నాడు. వారిద్దరూ కింద పడినప్పటికీ నోట్లో ఉన్న నాగూరన్ వేలిని తంగరాసు వదిలిపెట్టలేదు. నాగూరన్ చివరకు బలవంతంగా వేలిని బయటకు లాగాడు. అయితే తన వేలి భాగం తెగి రక్తం కారుతుండటం చూసి అతడు ఆందోళన చెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోవైపు నాగూరన్ బాలసుబ్రమణియన్ ఎడమ చేతి చూపుడు వేలికి తీవ్ర గాయం చేసిన నేరాన్ని తంగరాసు రంగసామి స్వచ్ఛందంగా అంగీకరించాడు. దీంతో అతడికి పది నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో భారతీయుడైన తంగరాసుకు సింగపూర్ కోర్టు పది నెలల జైలు శిక్ష విధించింది.
తోటి కార్మికుడి వేలు కొరికిన భారతీయుడికి పది నెలల జైలుశిక్ష విధించిన సింగపూర్ కోర్టు !
September 15, 2023
0
Tags