జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రదాడి వెనుక భారీ కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిష్ఠాత్మక జీ-20 కూటమి అధ్యక్ష పీఠంపై ఉన్నభారత్.. దానికి సంబంధించిన కొన్ని సదస్సులను శ్రీనగర్‌లో నిర్వహించాలని ఇటీవల నిర్ణయించింది. ఆర్టికల్-370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని తద్వారా ప్రపంచానికి చాటిచెప్పాలనుకుంది. ఆ ప్రణాళికలను దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ఉగ్రవాదులు తాజా ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడింది తామేనని పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ (జేఈఎం)కు ముసుగు సంస్థగా పేరున్న 'పీపుల్స్ యాంటీ ఫాసిస్టు ఫోర్స్ (పీఏఎఫ్‌ఎఫ్)' తాజాగా ప్రకటించింది. గోవాలో వచ్చే నెలలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు హాజరు కానున్నట్లు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో తాజాగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల నాయకుల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగేందుకు అవకాశాలున్న కీలక సమయంలో పూంచ్ దాడి చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. పూంచ్‌లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం బలగాలు ముమ్మరంగా గాలింపు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం స్థానికంగా దట్టమైన బాటా-డోరియా అటవీ ప్రాంతంలో డ్రోన్లు, జాగిలాలతోపాటు ఓ ఎంఐ హెలికాప్టర్‌ను రంగంలోకి దించాయి. బాంబు నిర్వీర్యక దళం, ప్రత్యేక ఆపరేషన్ బృందం కూడా అక్కడికి చేరుకున్నాయి. పూంచ్‌తోపాటు రాజౌరీ జిల్లాలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఘటనా స్థలాన్ని ఎన్‌ఐఏ బృందం పరిశీలించి, ఆధారాలు సేకరించింది. పోలీసులు ఇప్పటివరకు 12 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పూంచ్‌లో గురువారం భింబర్ గలీ నుంచి సాంగియోట్‌కు వెళుతున్న ఓ సైనిక వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి, ఆపై గ్రనేడ్లు విసిరారు. దీంతో వాహనం అగ్నికీలల్లో చిక్కుకొని అయిదుగురు జవాన్లు అమరులయ్యారు. చైనాలో తయారైన 7.62 ఎంఎం స్టీల్ కోర్ తూటాలను ఈ దాడిలో ఉగ్రవాదులు వాడినట్లు తెలుస్తోంది. అందుకు ఆధారాలను ఘటనాస్థలంలో బలగాలు స్వాధీనం చేసుకొన్నాయి. అయిదుగురు ఉగ్రవాదులు వాహనానికి మూడు వైపుల నుంచి కాల్పులకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
దాడి చేసింది మేమే : పీఏఎఫ్‌ఎఫ్ ప్రకటన
April 22, 2023
0
Tags