తమిళనాడు గవర్నర్‌కు వ్యతిరేకంగా స్టాలిన్‌ ప్రభుత్వం మరో తీర్మానం

Telugu Lo Computer
0


తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి వ్యతిరేకంగా సీఎం ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మరో తీర్మానం చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ క్లియర్ చేయడం లేదని, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారని అందులో ఆరోపించారు. సోమవారం తమిళనాడు అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌ మాట్లాడారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చేసిన రెండో తీర్మానమని తెలిపారు. గవర్నర్ నిర్లిప్త వ్యక్తిగా ఉండాలని సర్కారియా కమిషన్ పేర్కొందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో గవర్నర్ జోక్యం చేసుకోకూడదని డాక్టర్ అంబేద్కర్ కూడా చెప్పారన్నారు. అలాగే గవర్నర్‌ గైడ్‌గా ఉండాలని అనేక సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా స్పష్టం చేశాయన్నారు. అయితే మన గవర్నర్ ప్రజలకు మిత్రుడిగా ఉండటానికి సిద్ధంగా లేరని సీఎం స్టాలిన్‌ విమర్శించారు. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్‌ పెండింగ్‌లో ఉంచుతూ తప్పుడు సమాచారం ఇస్తున్నారని దుయ్యబట్టారు. బిల్లును పెండింగ్‌లో ఉంచడం అంటే తిరస్కరించినట్లేనని ఇటీవల గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా స్టాలిన్‌ మండిపడ్డారు. 'గవర్నర్ చర్యలను మాత్రమే మేం విమర్శిస్తున్నాం. అసెంబ్లీ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తే ఊరుకోం' అని వ్యాఖ్యానించారు. అనంతరం తమిళనాడు మంత్రి దురై మురుగన్‌, గవర్నర్‌ రవికి వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు నిర్దిష్ట వ్యవధిలోగా ఆమోదం తెలిపేలా తమిళనాడు గవర్నర్‌కు తక్షణమే తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఈ తీర్మానం ద్వారా తమిళనాడు ప్రభుత్వం కోరింది. డీఎంకే, మిత్రపక్ష పార్టీలు ఈ తీర్మానానికి మద్దతుగా ఓటు వేసి ఆమోదించారు. అయితే సభలో మాట్లాడేందుకు తమకు సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)