ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ జిల్లా దంతేవాడలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతరతో పేల్చివేశారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. దంతేవాడ అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఈ ఉదయం డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) ప్రత్యేక యాంటీ-నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు. ఆ ఆపరేషన్ ముగించుకుని మినీ వ్యాన్‌లో తిరిగివస్తుండగా మావోయిస్టులు ఐఈడీతో దాడి చేసి వ్యాన్‌ను పేల్చేశారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఘటన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ ఐజీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాగా భద్రతా బలగాలపై దాడులు చేస్తామని నక్సల్స్ పేరుతో గతవారం పోలీసులకు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈలోపే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్న ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాడికి పాల్పడిన నక్సల్స్ ను ఉపేక్షించేది లేదన్నారు. మరోవైపు, ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ముఖ్యమంత్రి భగేల్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా అండగా ఉంటామని అమిత్ షా హామీ ఇచ్చారు.
పోలీసుల వాహనాన్నిపేల్చి వేసిన మావోయిస్టులు : 10 మంది మృతి
April 26, 2023
0
Tags