ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ కు నివాళ్లర్పించిన ప్రధాని

Telugu Lo Computer
0


శిరోమణి ఆకాలీదళ్‌ అగ్రనేత ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  నివాళ్లర్పించారు. పంజాబ్‌ గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌లతో నరేంద్ర మోడీ కలిసి ఆకాలీదళ్‌ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. బాదల్‌ భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి, ఎస్‌ఏడీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ పక్కన కాసేపు కూర్చున్నారు. ఆ సమయంలో సుఖ్‌బీర్‌ సింగ్‌ చేతిని పట్టుకొని ఓదార్చారు. మోడీ అక్కడ నుంచి వెళ్లిపోయిన వెంటనే బాదల్‌ భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలం ముక్త్సర్‌కు తరలించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుంచే ఆకాలీదళ్‌ నేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌పై నరేంద్ర మోదీ అత్యంత గౌరవాన్ని చూపేవారు. ఎన్నికల ప్రచార సమయంతోపాటు పలు సందర్భాల్లోనూ బాదల్‌పై ఉన్న అభిమానాన్ని మోడీ చాటుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ వారణాసి నుంచి పోటీ చేసేందుకు నామినేషన్‌ దాఖలు చేసే ముందు ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ పాదాలకు నరేంద్ర మోడీ నమస్కరించారు. ఆ సమయంలో అమిత్‌ షా, నీతీశ్‌ కుమార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, సుష్మా స్వరాజ్‌, రామ్‌విలాస్‌ పాశవాన్‌ వంటి నేతలు అక్కడే ఉన్నారు. అనంతరం ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బాదల్‌ మాట్లాడుతూ మన ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనే విషయంపై దేశ ప్రజలు ఆలోచించాలి. మోడీతో ఎవరిని పోల్చుకోగలం? మోడీకి ఓటు వేయండి.. అంటూ ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)