మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు వామపక్ష పార్టీల మద్దతు ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మహిళా రిజర్వేషన్ కోసం చేసే పోరాటంలో పాల్గొంటామని ప్రకటించారు. మహిళలకు భాగస్వామ్యం లేనంత వరకు సమాజం ముందుకు పోదని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేస్తున్నారు. దీక్షకు హాజరైన సీపీఎం నేత సీతారాం ఏచూరి.. కవితకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కవిత ఒక మంచి అడుగు వేశారని చెప్పారు. ఎన్నో అడ్డంకుల తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది, కానీ లోక్‌సభ ఆమోదముద్ర వేయలేదని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోడీ కూడా మద్దతు తెలిపారని గుర్తుచేశారు. ఆయన ప్రధానమంత్రి అయి తొమ్మిదేండ్లు పూర్తయినా ఇప్పటివరకు లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టలేదని విమర్శించారు. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని పట్టుబడతామని చెప్పారు. జంతర్‌మంతర్‌లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాలని చెప్పారు. బీజేపీ బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతిస్తాయన్నారు. భారత సంస్కృతిలో మహిళకు పెద్దపీట వేశారన్నారు. అమ్మానాన్న అంటారు.. అందులో అమ్మ శబ్ధమే ముందు ఉంటుంది. రాజకీయాల్లోనూ మహిళకు సముచిత స్థానం దక్కాలని స్పష్టంచేశారు. దీక్షకు మద్దతు తెలుపుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నదని, 1996లో నాటి ప్రధాని దేవేగౌడ హయాంలో బిల్లు పెట్టినా ఇంకా చట్టం కాలేదని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని చెప్పారు. అందువల్ల బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయన్నారు. మహిళాబిల్లు ఓ చారిత్రక అవసరమని, సాధించి తీరాలని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ సాధించే వరకూ విశ్రమించేది లేదని వెళ్లడించారు. దేశంలోని మహిళలందరిని కలుపుకొని పోరాడుతామన్నారు. ధరణిలో సగం, ఆకాశంలో సగం అనే తెలుగు నానుడి ఉన్నది. అందుకే అవకాశాల్లోనూ సగం కావాలని కోరుతున్నామని చెప్పారు. దీక్షకు మద్దతు తెలుపుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
బిల్లు ఆమోదం పొందేవరకు సంపూర్ణ మద్దతు : సీతారాం ఏచూరి
March 10, 2023
0
Tags