నాటు కొట్టుడు పాట కొత్త చరిత్ర లిఖించింది. వెండితెర పైన జూ ఎన్టీఆర్, రాం చరణ్ వేసిన స్టెప్పులు ఇప్పుడు ప్రశంసలుగా మారాయి. తెర వెనుక టీం చేసిన కష్టానికి ఆస్కార్ అవార్డు తెచ్చి పెట్టింది. నాటు కొట్టుడుకు ఆస్కార్ దక్కింది. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసింది. నాటు పాట ఇప్పుడు యూనివర్సల్ సాంగ్ గా మారిపోయింది. సినీ చరిత్రలో కొత్త రికార్డుకు కారణమైంది. ఆస్కార్ అవార్డు అందుకున్న ట్రిపులార్‌కు ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రపంచ వేదికపై తెలుగు సినీ కీర్తి పతాకం రెపరెపలాడింది. ఖండాంతరాలకు వ్యాపించిన తెలుగోడి ప్రతిభకు ఆస్కార్ పట్టం కట్టింది. ఆస్కార్ వేడుక ప్రారంభం నుంచి వేదిక పైన నాటు నాటు పాట సందడి కొనసాగింది. యాంకర్లు ఈ పాట డాన్స్ తోనే పురస్కారాలను వేదిక పైకి తెచ్చారు. నాటు నాటు సాంగ్ లైఫ్ పెర్ఫామెన్స్ కి దీపికా పదుకొనె సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లని ఆహ్వానించింది. రాహుల్, కాలభైరవ హుషారెత్తించేలా నాటు నాటు సాంగ్ ని పడుతూ ఆస్కార్ వేదికపై దుమ్ము దులిపారు. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ దక్కడంపై ట్వీట్ చేసిన ప్రధాని 'ఇది అసాధారణం. నాటు నాటు పాటకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కింది. ఇది రాబోయే సంవత్సరాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాట అవుతుంది. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు. భారతదేశం గర్వంతో ఉప్పొంగుతుంది' అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. నాటునాటు పాటకు ఆస్కార్ దక్కడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు ప్రజలను, భారతీయులందరికీ గర్వకారణంగా చేసినందుకు 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్ర బృందానికి అభినందనలు తెలపారు. తెలుగు జెండా రెపరెపలాడుతోందని ట్వీట్ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్.. కోట్లాది భారతీయుల హృదయాలను గర్వపడేలా చేసిందని చిరంజీవి ప్రశంసించారు. ఈ అవార్డు ద్వారా తెలుగుచిత్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరుగుతున్న ఆస్కార్ వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తాను భారతీయ వస్త్రధారణ తో వచ్చానని చెప్పారు. పులి తమ జాతీయ జంతువు అని అందుకే ఈ డ్రెస్ వేసుకున్నట్లు ఎన్టీఆర్ వెల్లడించారు. కేవలం ఆస్కార్ కార్పెట్ పై నడవటం కాదు...తాము భారత్ తరపున ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాము అని అందుకే ఈ డిజైన్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. తారక్ తో పాటుగా రాం చరణ్ బ్లాక్ డ్రెస్ వేసుకుని రెడ్ కార్పెట్ నడిచి తలుక్కున మెరిసిపోయారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా వేడుకలకు హాజరయ్యారు. బాలీవుడ్ నటి దీపికా పడుకొనేతో కలిసి రామ్ ఫొటోలకు ఫోజులిచ్చాడు.
నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు - ప్రముఖుల ప్రశంసలు !
March 13, 2023
0
Tags