బెంగళూరు- మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన ప్రధాని !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని మాండ్య జిల్లాలో బెంగళూరు- మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ఆదివారం ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రూ.వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. 'దేశాభివృద్ధికి, ప్రజల అభ్యున్నతికి డబుల్ ఇంజిన్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్, ఇతర పార్టీలు ఏం చేస్తున్నాయి? మోడీ కి సమాధి తవ్వాలని కాంగ్రెస్ కలలు కంటోంది. కానీ, దేశ ప్రజల ఆశీర్వాదం నాకు రక్షణ కవచంగా పనిచేస్తుందని వారికి తెలియదు. మోడీ కి గోతులు తవ్వాలనే కలలు కనడంలో వారు (కాంగ్రెస్ నేతలు) బిజీగా ఉన్నారు. మరోవైపు.. బెంగళూరు- మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించడంలో, పేదల జీవితాలను బాగుపరచడంలో నేను బిజీగా ఉన్నా'నని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోడీ కర్ణాటకలో పర్యటించడం ఈ ఏడాదిలో ఇది ఆరోసారి. ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభోత్సవానికి ముందు మాండ్య జిల్లా కేంద్రంలో భారీ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రధాని మోడీ కి ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా బెంగళూరు- మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టును రూ.8480 కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించారు. 118 కి.మీల పొడవైన ఈ రహదారి.. ఆ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని మూడు గంటల నుంచి దాదాపు 75 నిమిషాలకు తగ్గిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)