బెంగళూరు నగర శివార్లలోని యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో 14వ 'ఏరో ఇండియా 2023' షోను ప్రధాని సోమవారంనాడు ప్రారంభించారు. ప్రధాని రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. 98 దేశాలు ఈ ఏరో షోలో పాల్గొని, తమ ప్రతిభాపాటవాలను చాటుకుంటున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ విన్యాసాల సందర్భంగా స్వదేశీ ఎక్విప్‌మెంట్, టెక్నాలజీ ప్రదర్శనతో పాటు విదేశీ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం వంటి వాటిపై దృష్టి సారించనున్నారు. సుమారు 100 దేశాలు ఏరో షోలో పాల్గొంటున్నాయని, భారతపై ప్రపంచం ఎంత నమ్మకంగా ఉందో ఇది రుజువు చేస్తోందని మోదీ అన్నారు. విదేశీ రక్షణ ఉత్పత్తులకు మార్కెట్‌గానే కాకుండా, పలు దేశాలకు రక్షణ భాగస్వామిగా కూడా భారత్ ఉందని ఆయన చెప్పారు. అతిపెద్ద రక్షణ రంగ ఎగుమతిదారుగా ఎదిగే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు. ఎయిర్‌షోలో రికార్డు స్థాయిలో 98 దేశాలు ఈసారి పాల్గొంటుండటం విశేషం. ఆయా దేశాలు తమ రక్షణ, వైమానిక పాటవాలను ప్రదర్శించనున్నాయి. ఎయిర్ బస్, బోయింగ్, డసాల్ట్ ఏవియేషన్, బ్రహ్మోస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్‌సీ రోబోటిక్స్, సఫ్రాన్, రోల్స్ రాయిస్, ఎల్అండ్‌డీ, ఇజ్రాయెస్ ఏరోస్పేస్, భారత్ ఫోర్డ్ లిమిటెడ్, హెచ్ఏఎల్, బీడీఎల్, బీఈఎంఎల్ వంటి పలు సంస్థలు తమ రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. 30 దేశాల మంత్రులు, 65 మంది గ్లోబల్ సీఈఓలు, ఓఈఎంలు ఈ ఐదురోజుల కార్యక్రమంలో పాల్గొననున్నారు. 100 విదేశీ, 700 స్వదేశీ కంపెనీలతో సహా మొత్తం 800 డిఫెన్స్ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఫిబ్రవరి 13 నుంచి 15 వరకూ బిజినెస్ డేస్ అని, 16-18 తేదీలు ఏరో ప్రదర్శన తిలకించేందుకు వీలుగా పబ్లిక్ డేస్ అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రూ.75 వేల కోట్ల విలువైన 251 ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయని వెల్లడించారు.
14వ 'ఏరో ఇండియా 2023' షోను ప్రారంభించిన ప్రధాని
February 13, 2023
0
Tags